ఎవరిదో ఫస్ట్ సిక్స్.. ఆరో టైటిల్పై ముంబై, చెన్నై కన్ను.. మరో 5 రోజుల్లో ఐపీఎల్

ఎవరిదో ఫస్ట్ సిక్స్.. ఆరో టైటిల్పై ముంబై, చెన్నై కన్ను.. మరో 5 రోజుల్లో ఐపీఎల్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా వెలుగొందుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌‌పై గురిపెట్టాయి. ఇప్పటికే చెరో ఐదు ట్రోఫీలతో సమ ఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లూ.. 2026 సీజన్‌‌తో లీగ్‌‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నాయి. 2020లో ఐదో టైటిల్ నెగ్గిన ముంబై.. గత ఐదేళ్లుగా ఊరిస్తున్న ఆరో ట్రోఫీని హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముద్దాడాలని పట్టుదలగా ఉంది. 

మరోవైపు 2023లో ఐదోసారి చాంపియన్‌‌గా నిలిచిన సీఎస్కే.. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరలేక ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ, ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో బరిలోకి దిగుతున్న చెన్నై..  హార్దిక్, రోహిత్, సూర్యకుమార్‌‌‌‌, బుమ్రా, తిలక్ వంటి టీమిండియా స్టార్లతో కూడిన  ముంబై  లక్ష్యం ఒక్కటే. మరో టైటిల్ సాధించి లీగ్‌‌లో ఏకైక అగ్రగామిగా నిలవడం. ఈ రెండు టాప్ టీమ్స్ మధ్య ఆరో కిరీటం కోసం సాగే ఈ రేసు లీగ్‌లో అసక్తిని రేపుతోంది.   

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌)

వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరలేక నిరాశపరిచిన సీఎస్కే.. ఈ ఏడాది సరికొత్త వ్యూహాలతో, యువ రక్తాన్ని నింపుకుని బరిలోకి దిగుతోంది. రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్నా.. రాజస్తాన్ రాయల్స్ నుంచి స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకోవడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.

బలాలు

ఆల్‌‌రౌండర్ల సమూహం చెన్నైకి అతిపెద్ద బలం. జట్టులోని 25 మందిలో 11 మంది బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. శివం దూబే, జేమీ ఓవర్టన్, అమన్ ఖాన్ వంటి పేస్ ఆల్‌‌రౌండర్లు.. అకీల్ హుస్సేన్, మాథ్యూ షార్ట్, శ్రేయస్ గోపాల్ వంటి స్పిన్ ఆల్‌‌రౌండర్లు జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్ చేరికతో టాప్, మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతమైంది. ధోనీ ఫినిషర్ పాత్రలో ఉండటం జట్టుకు కొండంత అండ.

బలహీనతలు

బౌలింగ్ విభాగంలో అనుభవలేమి చెన్నైని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నేథన్ ఎలిస్ వంటి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గాయపడటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ కొత్త బంతితో రాణించగలరు కానీ, స్లాగ్ ఓవర్లలో రన్స్ నియంత్రించే విషయంలో స్పష్టత లేదు. అలాగే జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉండటం మేనేజ్‌‌మెంట్‌‌కు ఆందోళన కలిగిస్తోంది. ఫారిన్‌ పేసర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

CSK టీమ్:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, రాహుల్ చహర్, అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ముకేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్‌‌నీత్ సింగ్, నేథన్ ఎలిస్, మ్యాట్ హెన్రీ, మ్యాథ్యూ షార్ట్, అమన్ ఖా న్, ఉర్విల్ ప టేల్, జాక్ ఫోల్క్స్.

  • బెస్ట్ పెర్ఫామెన్స్‌‌

 5 టైటిల్స్‌‌ (2010, 11, 18, 21, 23)

ముంబై మళ్లీ మెప్పిస్తుందా!

సూపర్ స్టార్లతో నిండిన  ముం బై.. 2020 తర్వాత మళ్ళీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి 2026 సీజన్‌‌లో ఆరో టైటిల్ నెగ్గాలని హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై పట్టుదలగా ఉంది. గతేడాది క్వాలిఫయర్-2 వరకు వెళ్లిన ముంబై, ఈసారి పెద్దగా మార్పులు చేయకుండా పాత కోర్ టీమ్‌‌నే కొనసాగిస్తోంది. మినీ వేలంలో తక్కువ బడ్జెట్‌‌తోనే తెలివిగా పావులు కదిపింది.

బలాలు

ముంబైకి ప్రధాన బలం ఆ జట్టులోని టీమిండియా స్టార్ ప్లేయర్లు. ఇటీవల ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యులైన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్‌‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. వీరితో పాటు రోహిత్ శర్మ అనుభవం, ఓపెనింగ్‌‌లో అతను ఇచ్చే మెరుపు ఆరంభాలు బ్యాటింగ్ లైనప్‌‌ను మరింత పటిష్టం చేస్తున్నాయి. కెప్టెన్ హార్దిక్ ఆల్‌‌రౌండ్ టాలెంట్‌‌ వల్ల జట్టులో రకరకాల కాంబినేషన్లు ప్రయత్నించే అవకాశం ఉంది.

బలహీనతలు

స్పిన్ విభాగం ముంబైకి ప్రధాన బలహీనత. మిచెల్ శాంట్నర్ రూపంలో నాణ్యమైన పారిన్‌‌ స్పిన్నర్ ఉన్నప్పటికీ, అతనికి తోడుగా నిలిచే పేరున్న ఇండియా స్పిన్నర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. మయాంక్ మార్కండే,  మహమ్మద్ గజన్‌‌ఫర్ ఉన్నా.. ఒత్తిడి సమయాల్లో వారు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి. రోహిత్, డికాక్, ట్రెంట్ బౌల్ట్ వంటి సీనియర్లు కెరీర్ చివరి దశలో ఉండటం వల్ల వారి ఫిట్‌‌నెస్ జట్టుపై ప్రభావం చూపే ముప్పు ఉంది. స్లో పిచ్‌‌లపై ముంబై బ్యాటర్లు తడబడే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, జస్‌‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, శాంట్నర్, విల్ జాక్స్, నమన్​,ధీర్​ దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, రూథర్‌‌ఫర్డ్,  మహమ్మద్ గజన్‌‌ఫర్, అశ్విని కుమార్, రఘు శర్మ, రాజ్‌‌ అంగద్‌‌, మొహమ్మద్‌‌ ఇజార్, డానిష్ మలేవార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్.

బెస్ట్ పెర్ఫామెన్స్‌‌ 
5 టైటిల్స్‌‌ (2013, 15, 17, 19, 20)