మ్యాన్ హోల్ క్లీన్ చేస్తున్న కార్మికుడిపై దూసుకెళ్లిన కారు

మ్యాన్ హోల్ క్లీన్ చేస్తున్న కార్మికుడిపై దూసుకెళ్లిన కారు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  రోడ్డుపై మ్యాన్ హోల్ ను క్లీన్ చేస్తున్న  కార్మికుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ  కార్మికుడు మృతి చెందాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ముంబైలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చాలాప్రాంతాల్లో డ్రైనేజీలను మున్సిపల్ కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కంది వాలి ప్రాంతంలో ఓ మున్సిపల్ కార్మికుడు నడిరోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ లోకి దిగాడు. మ్యాన్ హోల్లోని చెత్తను తీసి..పైన ఉన్న మరో వ్యక్తికి అందిస్తుండగా..అతను దూరంగా పారబోస్తున్నాడు. ఈ సమయంలో మరోసారి మ్యాన్ హోల్ లో ఉన్న చెత్తను తీసేందుకు అందులోని కార్మికుడు వంగాడు. అది గమనించని కారు డ్రైవర్..అతని మీదుగా వాహనాన్ని పోనిచ్చాడు.  

ఈ ప్రమాదంలో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బయటకు తీసిన ఇతర కార్మికులు..ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.  కార్మికున్ని గమనించని కారు డ్రైవర్పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు..కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.