
ముంబై: ఇప్పటికే ప్లేఆఫ్స్ కు దూరమైన ముంబై ఇండియన్స్ తమతో పాటు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నూ ఇంటికి తీసుకెళ్లింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిచి మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన స్థితిలో ఉన్న సీఎస్‌కే గురువారం జరిగిన పోరులో చెత్త బ్యాటింగ్‌తో ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ముంబై బౌలర్లు డేనియల్ సామ్స్ (3/16), కార్తికేయ (2/22), మెరిడిత్ (2/27) దెబ్బకు తొలుత చెన్నై 16 ఓవర్లలో 97 స్కోరు చేసి ఆలౌటైంది. ధోనీ (33 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. ఛేజింగ్‌లో కాస్త తడబడిన ముంబై 14.5 ఓవర్లలో 103/5 స్కోరు చేసి గెలిచింది. హైదరాబాదీ తిలక్ వర్మ ( 32 బాల్స్ లో 4 ఫోర్లతో 34 నాటౌట్) మెరిశాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ (3/23) సత్తా చాటాడు. సామ్స్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ లభించింది.
ధోనీసేన ఢమాల్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై నిరాశ పరిచింది. ముంబై బౌలర్ల దెబ్బకు బ్యాటర్లంతా కనీసం పోరాటం లేకుండా పెవిలియన్ చేరారు. తొలి ఓవర్లోనే కాన్వే (0), మొయిన్ అలీ (0)ని ఔట్ చేసిన సామ్స్.. ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లోనే ఊతప్ప (1)ను కూడా బుమ్రా (1/12) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆపై రుతురాజ్ (7), రాయుడు (10), శివం దూబే (10) wపెవిలియన్ చేరడంతో సీఎస్‌కే 39/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రావో (12)తో కలిసి ధోనీ ఏడో వికెట్‌కు 39 రన్స్ జోడించి టీమ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే 13వ ఓవర్లో బ్రావోతో పాటు సిమర్జీత్ (2)ను కార్తికేయ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే తీక్షణ (0) ఔటైనా.. 16వ ఓవర్లో ధోనీ 4, 6 బాదాడు. కానీ సింగిల్ కోసం ప్రయత్నించే క్రమంలో ముకేశ్ (4) రనౌట్ కావడంతో చెన్నై రెండంకెల స్కోరుకే పరిమితమైంది.
తిలక్ గెలిపించాడు..
లక్ష్యం చిన్నదే అయినా ముంబై కూడా పోరాడక తప్పలేదు. సీఎస్‌కే యంగ్ పేసర్లు ముకేశ్ , సిమర్జీత్ (1/22) ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఒకే స్పెల్ లో వీరి కోటాను పూర్తి చేయించిన ధోనీ పవర్ ప్లేలో నాలుగు వికెట్లతో ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. తొలి ఓవర్లోనే ఇషాన్ (6)ను ఔట్ చేసిన ముకేశ్.. ఐదో ఓవర్లో సామ్స్ (1), స్టబ్స్ (0)ను ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ (18)ను పెవిలియన్ పంపిన సిమర్జీత్.. సీఎస్ కే ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. 33/4తో ఇబ్బందుల్లో పడిన ముంబైని యువ బ్యాటర్లు తిలక్, హృతిక్ షొకీన్ (18) ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 48 రన్స్ జోడించాక 13వ ఓవర్లో హృతిక్ ను అలీ బౌల్డ్ చేశాడు. అయితే తిలక్ కు తోడైన టిమ్ డేవిడ్ (16 నాటౌట్) 15వ ఓవర్లో రెండు సిక్సర్లతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 16 ఓవర్లలో 97 ఆలౌట్ (ధోనీ 36 నాటౌట్, సామ్స్ 3/16) ముంబై: 14.5 ఓవర్లలో 103/5 (తిలక్ 34 నాటౌట్, ముకేశ్ 3/23).
డీఆర్‌ఎస్‌కు పవర్ కట్
వాంఖడే స్టేడియంలో కాసేపు పవర్ కట్ అవడం చెన్నైకి చేటు చేసింది. డీఆర్ఎస్ సిస్టమ్ కు పవర్ సరఫరా చేసే మార్గంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ లో తొలి 10 బంతుల పాటు డీఆర్‌ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ కారణంగా రెండో బాల్‌కు కాన్వే, పదో బాల్‌కు ఊతప్ప ఎల్బీలకు రివ్యూ అడుగుదామనుకున్నా డీఆర్‌ఎస్ అందుబాటులో లేదని అంపైర్లు చెప్పారు. టాస్ టైమ్‌లోనూ ఓ ఫ్లడ్ లైట్ టవర్‌కు కాసేపు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.