
పుట్టిన రోజు దోస్తులను పిలిచి దావత్ ఇద్దామనుకున్నాడు ఓ యువకుడు. పార్టీ ఇచ్చి ప్రాణాలు తీయించుకున్నాడు. కడుపు నిండా తినిపించి..గొంతు నిండా తాగిపించిన దోస్తులే తన పాలిట యమకింకరులవుతారని ఊహించలేదు. చివరకు పుట్టిన రోజే అతని చివరి రోజవుతుందని అనుకోలేదు. బర్డ్ పార్టీలో గొడవ జరగడంతో స్నేహితులంతా కలిసి బర్డ్ డే బాయ్ ను హతమార్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.
బిల్ కట్టే విషయంలో గొడవ...
ముంబై శివారులోని గోవండిలోని ఓ ధాబాలో 18 ఏళ్ల బాలుడు తన పుట్టిన రోజు సందర్భంగా నలుగురు స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. కడుపు నిండా తిన్నారు. ఇష్టం వచ్చినట్లు తాగారు. దీంతో బిల్ రూ. 10 వేలు అయింది. అయితే బిల్లు పంచుకునే విషయంలో బాలుడికి అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. చివరకు బర్డ్ డే బాయ్ బిల్లు చెల్లించాడు. అనంతరం నలుగురు ఫ్రెండ్స్ మరో పార్టీ ఏర్పాటు చేసి బర్డ్ డే బాయ్ ను ఆహ్వానించారు. కేక్ తినిపించిన తరువాత తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
పారిపోయే ప్రయత్నం..
బర్డ్ డే బాయ్ ను చంపేసిన తర్వాత ఇద్దరు నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ స్వస్థలానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అహ్మదాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు మైనర్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.