రేసులోకి ముంబై ఇండియన్స్‌

రేసులోకి ముంబై ఇండియన్స్‌
  • కీలక మ్యాచ్‌‌లో పంజాబ్‌‌పై గెలుపు 
  • కింగ్స్‌‌కు ఏడో ఓటమి

అబుదాబి: హ్యాట్రిక్‌‌ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్‌‌ ఎట్టకేలకు గెలుపు బాటలోకి వచ్చింది. ప్లే ఆఫ్స్‌‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో మెప్పించింది. బౌలింగ్‌‌లో కీరన్‌‌  పొలార్డ్‌‌ (2/8), జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (2/24), బ్యాటింగ్‌‌లో సౌరభ్‌‌ తివారి (37 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), హార్దిక్‌‌ పాండ్యా (30 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌‌) సత్తా చాటడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్‌‌పై గెలిచింది. ఓవరాల్‌‌గా ఐదో విక్టరీతో 10 పాయింట్లతో టేబుల్లో ఏడు నుంచి ఐదో ప్లేస్‌‌కు దూసుకొచ్చింది. ఏడో ఓటమితో పంజాబ్‌‌ (8) ఆరో ప్లేస్‌‌కు పడిపోయింది. తొలుత పంజాబ్‌‌ కింగ్స్‌‌ 20 ఓవర్లో 135/6 స్కోరు చేసింది. ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ (29 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 42) టాప్‌‌ స్కోరర్‌‌. దీపక్‌‌ హుడా (28), కేఎల్‌‌ రాహుల్‌‌ (21) రాణించారు. అనంతరం ముంబై 19 ఓవర్లలో 137/4 స్కోరు చేసి గెలిచింది. తివారి, హార్దిక్‌‌తో పాటు డికాక్‌‌ (27) కూడా రాణించాడు. పొలార్డ్​ ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు.

గెలిపించిన తివారి, హార్దిక్‌‌

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ముంబైకి ఆరంభంలోనే డబుల్‌‌ స్ట్రోక్‌‌ తగిలింది. ఇన్నింగ్స్‌‌ నాలుగో ఓవర్లోనే వరుస బాల్స్‌‌లో రోహిత్‌‌ (8), సూర్యకుమార్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన  స్పిన్నర్‌‌ రవి బిష్నోయ్‌‌ (2/25)పంజాబ్‌‌ టీమ్‌‌లో ఉత్సాహం నింపాడు. ఈ దశలో మరో ఓపెనర్‌‌ డికాక్‌‌కు తోడైన సౌరభ్‌‌ తివారి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. పవర్‌‌ ప్లేలో రెండు ఫోర్లు కొట్టిన అతను హర్‌‌ప్రీత్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో లాంగాన్‌‌ మీదుగా సిక్సర్‌‌తో  ఛేజింగ్‌‌కు కాస్త జోష్‌‌ తెచ్చాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో డికాక్‌‌  ఓ బౌండ్రీతో స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తర్వాతి బాల్‌‌కే పుల్‌‌షాట్‌‌ ఆడే ప్రయత్నంలో అతను క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. అయినా వెనక్కుతగ్గని తివారి.. హార్దిక్‌‌ పాండ్యాతో కలిసి పోరాటం కొనసాగించాడు.  హార్దిక్‌‌ నెమ్మదిగా ఆడినా తివారి క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టాడు.  బిష్నోయ్‌‌ వేసిన 15వ ఓవర్లో భారీ సిక్స్‌‌ రాబట్టి ఛేజింగ్‌‌కు కాస్త ఊపు తెచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అతడిని ఔట్‌‌ చేసిన ఎలిస్‌‌ పంజాబ్‌‌ను రేసులోకి తెచ్చాడు. 24 బాల్స్‌‌లో 40 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో హార్దిక్​ తనలోని హిట్టర్​ను నిద్రలేపాడు.  షమీ బౌలింగ్‌‌లో వరుసగా 4, 6 కొట్టి ముంబైపై ప్రెజర్‌‌ తగ్గించాడు. ఆపై, అర్షదీప్‌‌ బౌలింగ్‌‌లో పొలార్డ్‌‌ (15 నాటౌట్) 6, 4 సహా 13 రన్స్‌‌ రాబట్టాడు. దాంతో, ముంబై  గెలుపు సమీకరణం 12 బాల్స్‌‌లో 16 రన్స్‌‌గా మారింది. షమీ వేసిన19వ ఓవర్లో హార్దిక్‌‌ వరుసగా 4,2, 4,6 బాది ముంబైని గెలిపించాడు.  

ఆదుకున్న మార్‌‌క్రమ్‌‌, హుడా 

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌కు ఓపెనర్లు లోకేశ్‌‌ రాహుల్‌‌, మన్‌‌దీప్‌‌ (15) మంచి ఆరంభమే ఇచ్చారు.  కాస్త నిదానంగా ఆడిన ఇద్దరు ఐదు ఓవర్లలో 35 రన్స్‌‌ రాబట్టారు కానీ,  మూడు ఓవర్ల తేడాతో 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌‌ 36/0 నుంచి 48/4తో కష్టాల్లో పడింది. ఆరో ఓవర్లో మన్‌‌దీప్‌‌ను ఎల్బీ చేసిన క్రునాల్‌‌ ముంబైకి బ్రేక్‌‌ ఇవ్వగా తర్వాతి ఓవర్లోనే పొలార్డ్‌‌.. క్రిస్‌‌ గేల్ (1), రాహుల్‌‌ను ఔట్‌‌ చేసి ప్రత్యర్థికి డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌‌లో హార్డ్‌‌ హిట్టర్‌‌ పూరన్‌‌ (2) ఎల్బీ అవ్వడంతో పంజాబ్‌‌ పూర్తిగా డీలా పడింది. ఈ టైమ్‌‌లో దీపక్‌‌ హుడాతో కలిసి ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. బౌల్ట్‌‌ వేసిన 15వ ఓవర్లో మార్‌‌క్రమ్‌‌ రెండు, దీపక్‌‌ ఓ ఫోర్‌‌తో జోరు పెంచాడు. ఆ ఓవర్లో 15 రన్స్‌‌ రావడంతో పాటు స్కోరు 100 దాటింది. ఐడెన్‌‌, హుడా జోరు చూస్తుంటే పంజాబ్‌‌ మంచి టార్గెట్‌‌ ఇచ్చేలా కనిపించింది. కానీ, 16వ ఓవర్లో మార్‌‌క్రమ్‌‌ను ఔట్‌‌ చేసిన రాహుల్‌‌ చహర్‌‌ ఐదో వికెట్‌‌కు 61 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. స్లాగ్‌‌ ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేశారు. దాంతో, చివరి ఐదు ఓవర్లలో 30 రన్స్‌‌ మాత్రమే చేసిన పంజాబ్ తక్కువస్కోరుకే పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌‌: 20 ఓవర్లలో 135/6 (మార్‌‌క్రమ్‌‌ 42, హుడా 28, పొలార్డ్‌‌ 2/8, బుమ్రా 2/24)

ముంబై:  19 ఓవర్లలో 137/4 (సౌరభ్‌‌ 45, హార్దిక్‌‌ 40 నాటౌట్‌‌, బిష్నోయ్‌‌ 2/25)