
ముంబై: ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో రికార్డు టైటిళ్లతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన 14 ఎడిషన్లలో తొమ్మిదిసార్లు ప్లేఆఫ్స్ (ఐదుసార్లు విజేత, ఒకసారి రన్నరప్) చేరింది. కానీ నిరుడు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరకుండానే ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బరిలో దిగుతోంది. వేలానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ బుమ్రా, సూర్యకుమార్, పొలార్డ్ లాంటి కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ.. మెగా ఆక్షన్ లో ఇషాన్ కిషన్ ను రూ.15.25 కోట్ల రికార్డు ధరతో మళ్లీ కొనుగోలు చేసింది. ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో ముంబై ఈ సీజన్ ను ఆరంభించనుంది.
బలాలు
ఒంటి చేత్తో మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకోగల రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, బుమ్రా, పొలార్డ్ వంటి కీలక ప్లేయర్లు జట్టులో ఉండటం ముంబైకి పెద్ద సానుకూలాంశం. వీరంతా రాణిస్తే ఈ టీమ్ విక్టరీలకు అడ్డుండదు. ఈ సీజన్ లో టాపార్డర్ లో డికాక్ లేకపోవడంతో ఇషాన్ తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. వన్‌డౌన్‌లో వచ్చే సూర్యతో టాపార్డర్ బలంగా కనిపిస్తోంది. ఆ తర్వాత టిమ్ డేవిడ్, పొలార్డ్, డొమెస్టిక్ ఫార్మాట్ లో మంచి ఫామ్ లో ఉన్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ, జూనియర్ డివిలియర్స్ గా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్, డేనియల్ సామ్స్ తో మిడిలార్డర్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ తో బ్యాటర్లు ఉండటం ముంబైకి అదనపు బలం. పొలార్డ్ తో పాటు సామ్స్ ఆల్ రౌండగా పనికొస్తాడు. పేస్ బౌలింగ్ లో బుమ్రాతో పాటు తైమల్ మిల్స్ రూపంలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి.
బలహీనతలు
గత సీజన్ వరకూ టీమ్‌లో కీలకంగా ఉన్న పాండ్యా బ్రదర్స్, డికాక్, బౌల్ట్ స్థాయి ప్లేయర్లను ముంబై కొనుగోలు చేయలేకపోయింది. సూర్యకుమార్ గాయం ముంబై టీమ్ కు తలనొప్పిగా మారింది. అలాగే, ఇంటర్నేషనల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఒక్క స్పిన్నర్ కూడా జట్టులో లేకపోవడం పెద్ద లోటు. ఇండియా పేసర్లలో బుమ్రాపైనే భారం పడనుంది. ఉనాద్కత్, థంపి అందుబాటులో ఉన్నా.. ఇద్దరూ పెద్దగా ఫామ్‌లో లేరు.