బక్రీద్ కోసం మేకలను ఇంటికి తీసుకొస్తే... హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన

బక్రీద్ కోసం  మేకలను ఇంటికి తీసుకొస్తే... హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన

బక్రీద్ సందర్భంగా ఓ ముస్లిం తన ఇంటికి మేకలను తీసుకురావడం వివాదాస్పదమైంది. మేకలను ఇంటికి తీసుకువచ్చినందుకు అపార్ట్ మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. అంతేకాదు  నివాసితులంతా కలిసి హనుమాన్ చాలీసా పఠించారు . ఈ ఘటన ముంబైలో జరిగింది. 

అసలు ఏం జరిగిందంటే..

ముంబైలోని మీరా రోడ్‌లోని హౌసింగ్ సొసైటీలో  పలు ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే బక్రీద్ సందర్భంగా కొందరు ముస్లింలు మేకలను సొసైటీలోని తమ ఇండ్లలోకి తీసుకొచ్చారు. దీంతో సొసైటీలోని ఇతర నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారు వినకపోవడంతో నివాసితులంతా కలిసి హనుమాన్ చాలీసా పఠించారు. 

ఈ ఏడాది స్థలం ఇవ్వలేదు..

మీరా రోడ్‌లోని హౌసింగ్ సొసైటీలో 200 నుంచి -250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయని మొహ్సిన్ షేక్ షేక్ తెలిపాడు. అయితే  రెసిడెన్షియల్ సొసైటీ ప్రతి ఏడాది మేకలను ఉంచడానికి తమకు కొంత స్థలాన్ని కేటాయించారని చెప్పాడు. కానీ  ఈ ఏడాది స్థలం ఇవ్వలేదన్నాడు. దీనికి కారణంగా రెసిడెన్షియల్ సొసైటీలోని ఇతర నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేయడమే అని తెలిపాడు. దీంతో ఆ  మేకలను తమ ఇండ్లలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే అభ్యంతరం వ్యక్తం చేశారని  ఆరోపించారు. 

నివాసితులు ఏమంటున్నారు

సొసైటీ ఆవరణలో పశువులను అనుమతించరాదని నిబంధన ఉందని నివాసితులు పేర్కొన్నారు. అందుకే మేకలను సొసైటీలోకి అనుమతించలేదన్నారు. దీనిపై సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బలి కోసం మేకలను తీసుకొచ్చినందుకు 11 మందిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హామీతో సద్దుమణిగిన వివాదం

సొసైటీ ఆవరణలో జంతువులను బలి ఇచ్చే ఆలోచన తమకు లేదని ముస్లీంలు తెలిపారు. ఈ వివాదంపై  పోలీసులు జోక్యం చేసుకోవడంతో  సొసైటీ నిబంధనల ప్రకారం ఆవరణలో జంతువులను బలి ఇవ్వబోమని సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో రెసిడెన్షియల్ సొసైటీ నుంచి మేకలను తరలించారు.