ముంబాయిలో చెరువులను తలపిస్తున్న రోడ్లు

ముంబాయిలో  చెరువులను తలపిస్తున్న రోడ్లు

ముంబాయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అంధేరి సబ్ వే వర్షపు నీటితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని క్లియర్ చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముంబాయి, థానేలో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది IMD. పాల్ఘర్ జిల్లాకు వచ్చే రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్, ఆ తర్వాత మూడు రోజుల పాటు అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.ఖండేశ్వర్ రైల్వే స్టేషన్ లో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నించారు.

రాయ్ గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రత్నగిరి, రాయ్ గడ్, కొంకణ్ జిల్లాల్లో ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. సీఎం ఏక్ నాథ్ షిండే సీఎస్ శ్రీవాస్తవతో రివ్యూ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసి.. అధికార యంత్రాంగం మొత్తం గ్రౌండ్ లో లెవల్ లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఏక్ నాథ్ షిండే సూచించారు.