
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా భక్తుల పైకి ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. గణేష్ విగ్రహ నిమజ్జనం ఇలా విషాదంగా మారడంతో భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు స్పాట్లోనే చనిపోగా, మరో నలుగురు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన 8 మందిలో నలుగురు బీటెక్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఏవీజీ లాజిస్టిక్స్కు చెందిన గూడ్స్ ట్రక్కుగా పోలీసులు గుర్తించారు.
జాతీయ రహదారి-373పై ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించేందుకు ట్రక్కు ప్రయత్నించిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హసన్ జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత ఎంఎస్ తెలిపారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది చనిపోయిన ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.