ధారావీలో డ్రోన్లతో నిఘా

ధారావీలో డ్రోన్లతో నిఘా
  • జనాలు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించకుండా
  • టెక్నాలజీ వాడుతున్న ముంబై పోలీసులు

ముంబై: మహారాష్ట్రలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ముంబై పోలీసులు, బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముంబైలోని ధారావి తదితర ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా డాంగ్రీ మార్కెట్‌కు వచ్చిన చాలా మందిని డ్రోన్ల సాయంతో గుర్తించి చెదరగొట్టామని అధికారులు చెప్పారు. కేవలం డ్రోన్లే కాకుండా రీ ఓరియెంటెండ్‌ ట్రాఫిక్‌ కెమెరాలు, హీట్‌ మ్యాప్‌లతో కూడా నిఘా పెట్టామని అన్నారు. మహారాష్ట్రలోని 297 యాక్టివ్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. “ పోలీసులకు అవసరమైన సేఫ్టీ కిట్స్‌ అందించాం. డ్రోన్లతో నిఘా పెట్టాం. ధారావి లాంటి ఏరియాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకునేందుకు టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది” అని డీసీపీ ప్రణయ అశోక్‌ చెప్పారు. ముంబైలో అతిపెద్ద ఏరియా ధారావిలో ఐదు రోజుల్లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈనెల 11న 28 కేసులు ఉండగా.. 16నాటికి అవి 86కు పెరిగాయి. అంతే కాకుండా మరణాలు కూడా నాలుగు నుంచి తొమ్మిదికి పెరిగాయి. మహారాష్ట్రలోని కొంత మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.