
ముంబైలో 2023 జూన్ 28 బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) గురువారం వరకు ముంబై, దాని పక్కనే ఉన్న థానే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ నుండి అక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
రాయ్‌గఢ్, రత్నగిరి, నాసిక్, పూణే, సతారా జిల్లాలతో సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడం వలన ముంబైలో పలు చెట్లు కూలిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పౌర అధికారులు తెలిపారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 26 చెట్లు పడిపోవడం, 15 షార్ట్ సర్క్యూట్‌లు, ఐదు ఇళ్లు కూలిపోవడం/పాక్షికంగా కూలిపోవడం వంటివి చోటుచేసుకున్నాయని పౌరసంఘం తెలిపింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు IMD భారీ నుండి అతిభారీ వర్షపాతాలు నమోదయ్యే చాన్స్ ఉందని హెచ్చరికను జారీ చేసింది.