
- 100 రన్స్ తేడాతో రాజస్తాన్‌పై గెలుపు
- రికెల్టన్, రోహిత్, సూర్య, హార్దిక్ బ్యాటింగ్ షో
- చెలరేగిన బౌల్ట్, బుమ్రా, కర్న్ శర్మ
జైపూర్: ఐపీఎల్–18లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రైన్ రికెల్టన్ (38 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రోహిత్ శర్మ (36 బాల్స్‌లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలకు తోడు సూర్యకుమార్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (23 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48 నాటౌట్) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 100 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది.
దీంతో వరుసగా ఆరో విజయంతో టాప్‌లో నిలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 217/2 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్ 16.1 ఓవర్లలో 117 రన్స్‌కే ఆలౌటైంది. ఆర్చర్ (30) టాప్ స్కోరర్. బౌల్ట్ (3/28), కర్న్ శర్మ (3/23), బుమ్రా (2/15) ధాటికి రాయల్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఎనిమిది పరాజయాలతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
నలుగురే దంచిండ్రు..
ముంబై ఓపెనర్లు రోహిత్, రికెల్టన్‌ను కట్టడి చేయడంలో రాజస్తాన్ బౌలర్లు విఫలమయ్యారు. హిట్‌మ్యాన్ 2 ఫోర్లతో, రికెల్టన్ 6, 4తో గాడిలో పడ్డారు. ఐదో ఓవర్‌లో రోహిత్ 4, రికెల్టన్ 4, 6తో 18 రన్స్ దంచారు. తర్వాతి ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు, రికెల్టన్ ఫోర్‌తో పవర్‌ప్లేలో ముంబై 58/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత కూడా రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. 9వ ఓవర్‌లో వీరిద్దరు రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 రన్స్ రాబట్టారు.
ఈ క్రమంలో రికెల్టన్ 29 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేయగా ఫస్ట్ టెన్‌లో ముంబై స్కోరు 99/0కి పెరిగింది. 11వ ఓవర్‌లో 9 రన్స్ వచ్చినా 12వ ఓవర్‌లో తీక్షణ (1/47).. రికెల్టన్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 116 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. 31 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్‌ను 13వ ఓవర్‌లో పరాగ్ (1/12) వెనక్కి పంపాడు. 123/2తో ఉన్న దశలో సూర్య, పాండ్యా నిలకడగా ఆడారు. 14వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 16 రన్స్ చేశారు. చివరి 5 ఓవర్లలో 47 రన్స్ రావడంతో ముంబై 15 ఓవర్లలో 146/2 స్కోరు చేసింది. 16వ ఓవర్‌లో హార్దిక్ 4, సూర్య సిక్స్ కొట్టగా, 17వ ఓవర్‌లో ఆర్చర్14 రన్స్ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో హార్దిక్ 4, 6, 4, 4తో 21 రన్స్ దంచాడు. తర్వాత సూర్య 4, 6 కొట్టాడు. చివరి మూడు ఓవర్లలో 42 రన్స్ వచ్చాయి.
బౌలర్లు అదుర్స్..
భారీ ఛేదనలో రాజస్తాన్ టాప్ ఆర్డర్ ముంబై బౌలింగ్ ముందు తేలిపోయింది. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (0)ని దీపక్ చహర్ (1/13) డకౌట్ చేశాడు. 1/1తో ఆట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్ (13), నితీశ్ రాణా (9)ను బౌల్ట్, బుమ్రా కుదురుకోనీయలేదు. జైస్వాల్ రెండు సిక్స్‌లు, రాణా రెండు ఫోర్లతో టచ్‌లో కనిపించినా వికెట్ కాపాడుకోలేకపోయారు. రెండు, నాలుగో ఓవర్లలో బౌల్ట్ దెబ్బకు ఈ ఇద్దరూ వెనుదిరిగారు. ఐదో ఓవర్‌లో బుమ్రా వరుస బాల్స్‌లో రియాన్ పరాగ్ (16), హెట్‌మయర్ (0)ను పెవిలియన్‌కు పంపడంతో రాయల్స్ 47/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
పవర్‌ప్లే ముగిసేసరికి 62/5తో ఎదురీత మొదలుపెట్టింది. ధ్రువ్ జురెల్ (11), శుభమ్ దూబే (15) ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. పాండ్యా (12), ఇంపాక్ట్‌గా వచ్చిన కర్న్ శర్మ వరుస ఓవర్లలో వీళ్లను ఔట్ చేయడంతో రాయల్స్ 76/7తో కూరుకుపోయింది. ఆర్చర్, తీక్షణ (2) మెల్లగా ఆడటంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 82/7గా మారింది. 11వ ఓవర్‌లో బుమ్రా.. తీక్షణ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. కానీ 12వ ఓవర్‌లో కర్న్ శర్మ.. తీక్షణ, కుమార్ కార్తికేయ (2)ను పెవిలియన్‌కు పంపాడు. 13వ ఓవర్‌లో ఆర్చర్ 6, 6, 4తో కాసేపు పోరాడినా 17వ ఓవర్‌లో బౌల్ట్ ఔట్ చేయడంతో రాయల్స్ టార్గెట్ అందుకోలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 217/2 (రికెల్టన్ 61, రోహిత్ 53, పరాగ్ 1/12).
రాజస్తాన్: 16.1 ఓవర్లలో 117 ఆలౌట్ (ఆర్చర్ 30, పరాగ్ 16, బౌల్ట్ 3/28, కర్న్ శర్మ 3/23).