మూగబోయిన మైకులు..మొదలైన పంపకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మూగబోయిన మైకులు..మొదలైన పంపకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • రేపే పోలింగ్
  • ​అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు పంచుతున్నట్లు సమాచారం
  • కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు పలుచోట్ల సీపీఐతో జత కట్టిన బీఆర్ఎస్ 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు:  మున్సిపల్​ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజు సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.

సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోయాయి. అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, గిఫ్టుల పంపిణీపై దృష్టి పెట్టారు. పలుచోట్ల అపార్ట్ మెంట్లలో చికెన్ తో భోజనాలు ఏర్పాటు చేశారు. మరోవైపు మున్సిపాలిటీల్లో మద్యం దుకాణాలను (48 గంటలపాటు) మూసివేశారు. రేపు(బుధవారం) మున్సిపల్​పోలింగ్​జరగనుండగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రచార కూలీ రూ.500 వరకు 

మున్సిపల్​ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థులు ఉదయం రూ.200 నుంచి రూ. 300, ఉదయం నుంచి సాయంత్ర వరకు వస్తే రూ.500 ఇచ్చారు. పలుచోట్ల చివరి రోజు ప్రచారానికి వచ్చిన వారితోపాటు డివిజన్లు, వార్డుల్లోని ఓటర్లకు భోజనాలు పెట్టించి ఆకట్టుకున్నారు. 

ఒకరిని మించి మరొకరు డబ్బులు పంపిణీ!

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండు జిల్లాలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోందన్న చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా పలువురు అభ్యర్థులు  ఒకరిని మించి మరొకరు పంచుతున్నట్లు తెలిసింది. కొత్తగూడెంలోని కొన్ని డివిజన్లలో మొదటి విడతగా రూ.1,000, రూ.1,500 పంచిన అభ్యర్థులు ప్రత్యర్థులు రూ.2 వేలు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో రూ.1,000 అదనంగా ఇస్తున్నట్లు సమాచారం.  

పలుచోట్ల సీపీఐతో బీఆర్ఎస్​ పొత్తు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​జోరును అడ్డుకునేందుకు బీఆర్ఎస్​పార్టీ పలుచోట్ల సీపీఐతో పొత్తు పెట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం జత కట్టాయి. కాగా, కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​లో కాంగ్రెస్​ను ఓడించడమే లక్ష్యంగా పలు డివిజన్లలో బీఆర్ఎస్​ సీపీఐతో కలిసి ముందుకు సాగుతోంది. పార్టీ వీక్​గా ఉన్న కొన్ని డివిజన్లలో సీపీఐకి మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్​నేతలు అధికారికంగా ప్రకటించడాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.