- జీహెచ్ఎంసీ సహా ఐదు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ముగిసిన పాలకవర్గాల గడువు
- ఈ ఏడాది చివర్లోనే జరగనున్న ఎన్నికలు
- అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా
- సర్‌కు ముందు జరిగే అవకాశాలు లేనట్టే
- అన్నింటికి ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే చాన్స్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్ తర్వాతే రాష్ట్రంలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబారాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో సహా ఇంకా మిగిలి ఉన్న ఐదు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఫిబ్రవరి 2026లో రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీతో సహా ఐదు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలలో పాలకవర్గాల గడువు తీరింది. ప్రస్తుతం వీటిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల కానున్నది. ఆ ఓటర్ల జాబితా ఆధారంగా డివిజన్లు, వార్డులు విభజించి ఈ ఏడాది చివర్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్‌కు ముందు ఎన్నికలు జరిగే అవకాశాలు లేనట్లేనని ఆ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రేటర్‌తో పాటు అన్నింటికి ఒకే సారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ తరువాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచించింది. అయితే అంతలోనే సర్ రావడంతో ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తుంది.
ఫిబ్రవరిలోనే ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 10న ముగిసింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. చట్ట ప్రకారం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. అయితే ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో వీలు కాలేది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి అనే పేర్లతో కొత్తవి ఏర్పాటు చేశారు. కొత్తగా 12 జోన్లు, 300 డివిజన్లను ప్రకటించారు. ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరలో నిర్వహించే అవకాశం ఉంది. మూడు కార్పొరేషన్ల విభజనకి ముందు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న ఏడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అంతకు ముందు శివారులోని కొన్ని గ్రామ పంచాయతీలను ఆ లోకల్ బాడీల్లో విలీనం చేశారు. ఇలా విలీనమైన లోకల్ బాడీల్లో పాలక మండళ్ల గడువు ముగిసి 16 నెలలైంది. లోకల్ బాడీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 ఫిబ్రవరితో ముగిసింది. అనేక గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీలు అన్ని కలిపి ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో విలీనం అయ్యాయి.
మే నెలలో మరికొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో..
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది మే 6న ముగిసింది. ప్రభుత్వం వీటికి స్పెషల్‌ఆఫీసర్లను నియమించింది. గ్రేటర్ వరంగల్‌లో ప్రస్తుతం 66 డివిజన్లు ఉండగా వీటిని 100 డివిజన్లకు, గ్రేటర్ ఖమ్మంలో 60 డివిజన్లను 70కి పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. మున్సిపల్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి. వీటిలో డివిజన్ల పునర్విభజనతో పాటు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నది. పాలకవర్గాల గడువు ముగిసిన ఐదు మున్సిపాలిటీలలో యథావిధిగా వార్డుల వారీగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్ పూర్తయిన వెంటనే రిజర్వేషన్లు ఖరారు
ఎన్నికలు జరగాల్సిన ఐదు గ్రేటర్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఓటరు జాబితా ఆధారంగా డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అది కూడా సర్ పూర్తయిన తర్వాత విడుదల చేసే తుది ఓటరు జాబితా ఆధారంగా రూపొందిస్తారు. ఆ తరువాతే పోలింగ్ స్టేషన్లను గుర్తించనున్నారు. గత ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో 123 చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలోనే జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, ఇతర ఐదు మున్సిపాలిటీల మేయర్, చైర్ పర్సన్ల రిజర్వేషన్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు చోట్ల యథావిధిగా మేయర్, చైర్ పర్సన్ రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఉన్నది. మేయర్ రిజర్వేషన్ ప్రకటన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం కారణంగా మళ్లీ ఈ మూడింటికి కొత్తగా మేయర్ పోస్టు కోసం రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే కొత్తగా సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు ఏర్పడటంతో పాటు పాత జీహెచ్ఎంసీ పరిధిలో కూడా చాలా మార్పులు జరిగాయి. మూడు కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, మూడింటికి సంబంధించిన 300 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. అలాగే గ్రేటర్ వరంగల్, ఖమ్మం, ఇతర ఐదు మున్సిపాలిటీల డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాల్సి ఉన్నది.
గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు?
సర్ పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. సర్‌కు సంబంధించిన తుది జాబితా అక్టోబర్ 1న విడుదల కానుంది. గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే చాన్స్ ఉంది. మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి మంత్రులు కీలకంగా వ్యవహరించే అవకాశముంది. అభివృద్ధిపై ఫోకస్ పెట్టేందుకు కార్పొరేషన్లలోని జోన్ల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించే చాన్స్ ఉంది. మూడు కార్పొరేషన్లలో కలిపి మొత్తం 12 జోన్లు ఉన్నాయి. జోన్ కు ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మూడు కార్పొరేషన్లలో కూడా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు విలీనం అయ్యాయి. ఆ ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. అవసరమైన చోట మంత్రులు వెంటనే పనులు చేయించే బాధ్యతలు తీసుకోనున్నారు.
