చివరి రోజు .. మంత్రుల ప్రచార జోరు.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లకు ఓట్లేసి గెలిపించాలని పిలుపు

చివరి రోజు .. మంత్రుల ప్రచార జోరు.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లకు ఓట్లేసి గెలిపించాలని పిలుపు
  •     కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రులు     
  • ముగిసిన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజైన సోమవారం వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మంత్రులు విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే మహిళలకు ఫ్రీ బస్సు, పేదలకు రేషన్‌‌‌‌‌‌‌‌ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతున్నామని చెప్పారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో.. అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్లను గెలిపిస్తేనే అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని చెప్పారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం గేమ్‌‌‌‌‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌ :  మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్/కోదాడ/తిరుమలగిరి/నేరేడుచర్ల, వెలుగు : పేదల కోసం అనేక పథకాలు అమలుచేస్తూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం గేమ్‌‌‌‌‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌గా మారిందని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీల్లో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామేల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్‌‌‌‌‌‌‌‌కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేకంగా అర్బనైజేషన్‌‌‌‌‌‌‌‌ ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

పదేండ్లలో చేయలేని అభివృద్ధిని రెండేండ్లలో చేసినం :  మంత్రి పొన్నం

హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో గత పదేండ్లలో చేయలేని అభివృద్ధిని రెండేండ్లలోనే చేసి చూపించామని, మిగతా మూడేండ్లలో మొత్తం రూపురేఖలే మారుస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ‘బయటి నుంచి ఎవరో వచ్చి దొరనన్న అహంకారంతో ఎమ్మెల్యేనైన నన్ను రారా.. పోరా అంటే ఊకుంటానా ? ఊరి పొలిమేర కూడా దాటనియ్య’ అని హెచ్చరించారు. 

‘నేను చూస్తే ఐదు ఫీట్లే కనబడుతున్న కావచ్చు.. కానీ భూమిలోకి కూడా ఐదు ఫీట్లు ఉన్న జాగ్రత్త’ అని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మరక కూడా లేదని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరానని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ను తిరిగి కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పట్టం కట్టాలి :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పట్టం కట్టాలని కోరారు. పట్టణంలోని పలు డివిజన్లలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ, సీసీ రోడ్డును పూర్తి చేయడంతో పాటు కాలనీల్లో సమస్యలను పరిష్కరిస్కామని హామీ ఇచ్చారు. 

పూటకో పార్టీ మారే వారిని, ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. ‘నేను పేదోళ్ల మనిషిని, ఇచ్చిన మాట తప్పను, నల్గొండ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది, ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించి మోసపోవద్దు’ అని సూచించారు. చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ క్యాండిడేట్లను రికార్డు మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

పదేండ్లలో ఏం చేశారని ఓట్లడుగుతున్నరు : మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : వందలాది మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పదేండ్లు చేసిందేమీ లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. సోమవారం వనపర్తిలో మాట్లాడుతూ... ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా జైలుకెళ్లక తప్పదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని వారు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులను గెలిపిస్తే నిజాయితీగా పనిచేస్తారని చెప్పారు. 

ములుగు జిల్లా ఎక్కడికీ పోదు : మంత్రి సీతక్క

ములుగు/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు పట్టణంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ములుగు జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ములుగు జిల్లా ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేసి ఆ పార్టీ క్యాండిడేట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

అందరి లెక్కలు తేలుస్తా : మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్, వెలుగు : ‘రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా, ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు, హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్కలు ఎన్నికలు ముగిసిన తర్వాత తేలుస్తా’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని ప్రచార వరంగల్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు.చందాలు, దందాలు చేసినా, తింగరి వేషాలు వేసిన వారిని చట్ట ప్రకారం బొక్కలో వేయించడం ఖాయమన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు. రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను నమ్మొద్దని సూచించారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడుతామని హామీ ఇచ్చారు. 

పదేండ్లు ప్రజలు మోసపోయిన్రు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు

జమ్మికుంట, వెలుగు : పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ రాచరిక పాలనలో ప్రజలు మోసపోయారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే చెక్‌‌‌‌‌‌‌‌ పెడతామని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోలో చూపిన హామీలను అమలు చేశాకే అసెంబ్లీ ఎన్నికలకు పోతామని స్పష్టం చేశారు.