ఒంటరి పోరుకు సై..! కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరని పొత్తు చర్చలు

ఒంటరి పోరుకు సై..! కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరని పొత్తు చర్చలు
  • మధిర మున్సిపాలిటీలో రెండు పార్టీల దోస్తీ
  • కొత్తగూడెం మేయర్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ విషయంలో పీటముడి 
  • ఒంటరిగానే బరిలోకి దిగుతాంఅంటున్న కాంగ్రెస్ నేతలు 
  • ఇప్పటికే కేడర్ కు స్పష్టంగా చెప్పిన మంత్రి పొంగులేటి
  • బీఆర్ఎస్, సీపీఎం మధ్య కుదిరిన పొత్తు
  • సింగిల్ గానే బీజేపీ, జనసేన, టీడీపీ పోటీ 

ఖమ్మం, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సీపీఐతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు వచ్చినా, ప్రస్తుతానికి రెండు పార్టీల నేతల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు సమాచారం. ప్రధానంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్​విషయంలో ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో చర్చలకు బ్రేక్ పడింది. దీంతో కాంగ్రెస్​సింగిల్ గానే పోటీకి సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే ముఖ్యనేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మూడ్రోజుల క్రితం మధిర మినహాయించి ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు చెందిన ముఖ్యనేతలతో పొంగులేటి వేర్వేరుగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి వారికి వివరించినట్టు సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారావుపేట మున్సిపాలిటీలో సీపీఎంతో పొత్తు ఉంటుందని చెప్పారు. మిగిలిన చోట్ల ఒంటరిపోరుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. అయితే చివరి నిమిషంలో అయినా కొత్తగూడెం కార్పొరేషన్​, ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఒంటరిగా పోటీచేస్తే రెండు పార్టీలకూ నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధిరలో మాత్రం కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. 

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి..

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కన్ఫామ్ అయింది. ఈ రెండు పార్టీలు స్థానిక పరిస్థితులను బట్టి ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల షేరింగ్ కు అంగీకారానికి వచ్చాయి. జిల్లాలో సీపీఐ, సీపీఎం పార్టీలకు ఏదులాపురం, వైరా, మధిర మున్సిపాలిటీల పరిధిలో బలముంది. సీపీఎం, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుండడంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో సీపీఐ చీల్చే ఓట్లు ఇతర అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. 

మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ కూడా సింగిల్ గానే పోటీ చేయాలని డిసైడ్​అయ్యింది. అన్ని మున్సిపాలిటీల్లో సొంతంగా బలమైన కేడర్​ లేకపోయినా, పార్టీ హైకమాండ్​ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని చోట్లా ఒంటరిగానే పోటీలో ఉండాలని భావిస్తోంది. ఇక సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర మున్సిపాలిటీల్లో కొంత మేర ఓటర్లను ప్రభావితం చేయగలిగిన టీడీపీ కూడా సింగిల్ గానే సై అంటోంది. మధిరలో కాంగ్రెస్​తో పొత్తు కుదరవచ్చు అని ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికీ మాత్రం స్పష్టత రాలేదు. అదే సమయంలో అన్ని మున్సిపాలిటీల్లో తామూ ఒంటరిగా బరిలో ఉంటామని జనసేన పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచి బీఫామ్ లను అందించే అవకాశం కనిపిస్తోంది.

ఇవాళ్టి నుంచి నామినేషన్లు..!

ఉమ్మడి జిల్లాలో ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈనెల 30వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా, ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ. వచ్చే నెల 11న అన్ని చోట్లా ఎన్నికలు జరగనుండగా, 13న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణా తరగతులు పూర్తయ్యాయి.