ఉప్పొంగిన మున్నేరు.. : తెలంగాణ – ఏపీ మధ్య రాకపోకలు బంద్

ఉప్పొంగిన మున్నేరు.. : తెలంగాణ – ఏపీ మధ్య రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.  ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు  వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి.  భారీ వర్షాలు పడుతుండడంతో  జగ్గయ్యపేట మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. ఏన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల మున్నేరు బ్రిడ్జిపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుంది.

నిమిషానికి నిమిషానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలను బంద్ చేశారు అధికారులు.  పురాతన బ్రిడ్జ్ కావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆంధ్ర, తెలంగాణకు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.  

మున్నేరు బ్రిడ్జికి ఇరు పక్కల భారీ గేట్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.   వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్,విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 26వ తేదీ బుధవారంతో పాటు జులై 27, జులై 28వ తేదీ వరకు విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణపై ఉదృతంగా ఉండడం..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ...తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.