మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు ఏమాయె!..ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీట మునిగిన ఖమ్మం కాలనీ

మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు ఏమాయె!..ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీట  మునిగిన ఖమ్మం కాలనీ
  • మూడేళ్లుగా ప్రపోజల్స్​ కాగితాలకే పరిమితం
  •  2021లో రూ.146 కోట్లతో ఎస్టిమేషన్స్​ పంపిన అధికారులు
  •  వారం రోజుల్లో రూ.170 కోట్లతో మరోసారి పంపేందుకు రెడీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు వాగుకు ఇరువైపులా కరకట్టలు కలగానే మిగిలిపోతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్​సూచనలతో 2021లో రూ.146 కోట్లు బడ్జెట్ అవసరమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపగా నేటికీ ఆమోదించలేదు. దీంతో ఇటీవల భారీ కురిసిన వానలకు ఎగువ జిల్లాల నుంచి మున్నేరుకు వరద పోటెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 30.7 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో వాగుకు సమీపంలోని కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. రెండు వైపులా ఉన్న 15 కాలనీల్లోని వెయ్యి ఇండ్లలోకి వరద నీరు చేరింది. 2 వేల మందికి పైగా రిలీఫ్ క్యాంపులకు తరలించాల్సి వచ్చింది. కరకట్టలు నిర్మిస్తే ముంపు సమస్య ఉండేది కాదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కింద మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చిన టైంలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కరకట్టలు ఏర్పాటు చేయాలని డిమాండ్​చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్ ఖమ్మం వచ్చిన టైంలోనూ కరకట్టతోపాటు తీగల వంతెన నిర్మిస్తామని చెప్పారని, వీలైనంత త్వరగా హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.  

కరుణగిరి బైపాస్​– ప్రకాష్​నగర్​చప్టా

పువ్వాడ అజయ్​మంత్రి పదవి చేపట్టాక రూ.146 కోట్లతో కరుణగిరి బైపాస్ నుంచి ప్రకాష్​నగర్ చప్టా వరకు 2.9 కిలోమీటర్ల చొప్పున మున్నేరుకు రెండు వైపులా కరకట్టలు నిర్మించాలని అధికారులతో ప్రపోజల్స్ రెడీ చేయించారు. కట్టలతోపాటు వాటిపై వాకింగ్ ట్రాక్, సెంట్రల్​ లైటింగ్, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్ లు పెట్టాలని ప్లాన్​చేశారు. మూడేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రెండు రోజుల కింద 15 కాలనీలు నీటమునిగాయి. దీంతో అధికారులు మళ్లీ అంచనాలు రూపొందించే పనిలో పడ్డారు. 20 శాతం బడ్జెట్ పెంచి, రూ.170 కోట్లతో వారం రోజుల్లో కొత్తగా ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నారు.