మునుగోడు,వెలుగు : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఉరుకునేది లేదని మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సోమవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
2018లో బీఆర్ఎస్ గాలి వీస్తున్న తరుణంలోనే మునుగోడు నుంచి రాజగోపాల్రెడ్డి గెలుపొంది చరిత్ర సృష్టించారన్నారు. అభివృద్ధి పనులు చేస్తామంటే కనీసం శిలాఫలకం వేయడానికి కూడా ఒప్పుకోలేని నీచపు బుద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది అని మండిపడ్డారు. కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలపై కేసులు పెట్టించడం, భూకబ్జాలు చేయడం, ఎస్సై, సీఐ, తహసీల్దార్ల వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్నాయకులకు లేదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్యయాదవ్, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సైదులు, నాయకులు పాల్గొన్నారు.
