కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
  • ఇచ్చిన హామీలు ఏమైనయ్​..  దళిత ఆత్మీయ సమ్మేళనంలో రాజగోపాల్ రెడ్డి 
  • కేసీఆర్‌‌‌‌.. ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు: తరుణ్‌‌ చుగ్‌‌    కేసీఆర్ దళిత ద్రోహి: వివేక్ వెంకటస్వామి

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: దళితులు బాగుపడితే సీఎం కేసీఆర్ ఓర్వలేరని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. శనివారం మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ ఓర్వలేక పోయారని, అందుకే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా చేశారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. తెలంగాణ వచ్చినా దళితుల బతుకులు మారలేదన్నారు. ప్రాజెక్టుల పేరిట సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచి పెట్టి, అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు. అధికారం, డబ్బును నమ్ముకుని కేసీఆర్ వచ్చారని, తాను మిమ్మల్ని నమ్ముకుని ఎన్నికకు వచ్చానని తెలిపారు. అవినీతి సొమ్ముతో గెలవాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ బిడ్డ బండి సంజయ్ యాదాద్రి గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తే, గుడిని సంప్రోక్షణ చేయాలంటూ కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనను ఆశీర్వదిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నారు. 

దమ్ముంటే దళితుడిని సీఎం కుర్చీలో 
కూర్చోబెట్టు: సంజయ్ 

దళితులకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చినట్లే ఇచ్చి, కారణాలు చెప్పకుండా తొలగించారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని, ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు నిధులివ్వడం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్నే తిరగరాస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎంవోలో దళిత అధికారులను దగ్గరకు కూడా రానివ్వడం లేదని, యావత్ సమాజం థూ.. అని ఊస్తే సీఎంవోలోకి దళిత అధికారిని తీసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయాలని, కొత్త సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో దళితుడిని సీఎంగా కూర్చోబెట్టాలని సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు యువకులకు కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని చెప్పారు. 

కేసీఆర్​.. నీ ఆటలు సాగవు: తరుణ్‌‌‌‌‌‌‌‌ చుగ్‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర ప్రజలను తక్కువ అంచనా వేయొద్దని, నీ ఆటలు ఇక సాగవని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి చరిత్ర అందరికీ తెలుసని, ఆయన ఊళ్లలోకి వెళ్తే మహిళలు గేట్లు కూడా తీయడం లేదన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణచివేసేందుకు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి విజయం మునుగోడు ప్రజల విజయం, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి హాజరైన బండి సంజయ్, తరుణ్ చుగ్, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో కోలార్ ఎంపీ మునిస్వామి, మాజీ మంత్రులు బాబూ మోహన్, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.15 వేలు, రైతు బంధు ద్వారా రూ.30 వేలు కలిపి మొత్తం రూ.45 వేలు వచ్చేవన్నారు. ఇంతకుముందు దళితులు గుడిలోకి పోతే మలినమైందని కడిగేవాళ్లని, ఫామ్ హౌస్ కుట్రలో తమకు సంబంధం లేదని బీసీ బిడ్డ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తే,‌‌‌‌‌‌‌‌ ఆ గుడిని కడగాలని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలకు పిలుపునివ్వడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. దళితులు, బీసీలంటే కేసీఆర్ కుటుంబానికి చులకన అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల భూములు కూడా ధరణి పేరుతో సీఎం లాక్కున్నారని, అసైన్డ్ భూములపై హక్కును తీసేశారని, కబ్జాదారు కాలమ్ తీసేసి, దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. దళితులకు భూమి ఉండొద్దనే ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. మునుగోడు దళితులు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని వివేక్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు.