మధ్యాహ్నం లోపే మునుగోడు కౌంటింగ్​ పూర్తి

మధ్యాహ్నం లోపే మునుగోడు కౌంటింగ్​ పూర్తి
  •     ఆదివారం ఉదయం 7 గంటలకు లెక్కింపు మొదలు..
  •     ముందు పోస్టల్​ ఓట్లు...తర్వాత ఈవీఎంలు
  •     చౌటుప్పుల్​ మండలం నుంచే షురూ ..21 టేబుల్స్​, 15 రౌండ్లు    


నల్గొండ, వెలుగు : మరో 24 గంటల్లో మునుగోడు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. దీనికోసం అధికారులు నల్గొండలోని ఆర్జాలబావి సమీపంలోని ఎఫ్​సీఐ గోదాంలో కౌంటింగ్​ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడు నుంచి చివరి ఈవీఎం శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్​కు చేరింది. తెల్లవారుజామున 4.40 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్​రూమ్​ను సీజ్​ చేశారు. తర్వాత నుంచి కౌటింగ్​కు సంబంధించిన ఏర్పాట్ల పై అధికారులు దృష్టి పెట్టారు.  

ఉదయం 7 గంటలకే...

298 పోలింగ్​కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కోసం నల్గొండ పట్టణంలోని అర్జాలబావిలో ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 21 టేబుల్స్ పై15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 7గంటలకు  పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో  స్ట్రాంగ్ రూమ్‌‌ను ఓపెన్ చేసి, పోలైన 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను కౌంట్​చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.  

ఫస్ట్​రౌండ్​ఫలితం 9గంటలకు...

మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు..చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1గంట వరకు ప్రకటిస్తారు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది కి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్​ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది.  ఒక్కో టేబుల్​కు కౌంటింగ్ సూపర్​వైజర్​,అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.  కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం సీఆర్పీఎఫ్​ బలగాలు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించా రు.