మునుగోడును అభివృద్ధి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడును అభివృద్ధి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చండూరు, నాంపల్లి, వెలుగు:  మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.  శనివారం నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇడికుడ గ్రామం నుంచి గట్టుప్పల్ మండలం తెరటుపల్లి వరకు రూ. 30 కోట్లు, తాస్కాని గూడెం గ్రామం నుంచి చండూరు టౌన్ వరకు  రూ.13 కోట్లతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు, చండూరు పట్టణంలో రూ. 2.90  కోట్ల వ్యయంతో శనిగ చెరువు ( చిన్న కుంట చెరువు ) సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 

గుండ్రపల్లిలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీతో కలిసి ప్రారంభించారు.  అనంతరం నాంపల్లి మండలం పసునూరు గ్రామం నుంచి వెంకటంపేట మీదుగా సాగర్ రోడ్డు వరకు రూ. 25 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవోలు మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశ్వాసానికి మారుపేరు యాదవులు

చౌటుప్పల్, వెలుగు: విశ్వాసానికి మారుపేరుగా యాదవ కులస్తులు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ మాజీ ఉపసర్పంచ్ పద్మ చిరంజీవి, పాక ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఫోటోలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవ కులస్తులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. చౌటుప్పల్ లో భారీ ఎత్తున సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన పాక కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.