ట్రిపుల్ ఆర్ ఆపాలంటే కురుక్షేత్ర యుద్ధం చేయాలి

ట్రిపుల్ ఆర్ ఆపాలంటే కురుక్షేత్ర యుద్ధం చేయాలి
  • అలైన్​మెంట్ మార్పిస్తా.. లేకుంటే పరిహారం ఎక్కువ ఇప్పిస్త
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కామెంట్స్

యాదాద్రి, వెలుగు :  “ నేను ఎమ్మెల్యే కాకముందే ట్రిపుల్​ఆర్ అలైన్​మెంట్ పూర్తయింది. అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసింది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఇప్పుడు న్యాయం చేయడానికి సీఎంతో మాట్లాడతా.. ప్రభుత్వంతో కొట్లాడతా.. ఒక్క శాతం చాన్స్ ఉన్నా అలైన్​మెంట్​మార్పిస్తా..” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్​లో ట్రిపుల్​ఆర్​కారణంగా భూమి కోల్పోయే వారితో నిర్వహించిన మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు.

 ముందుగా ట్రిపుల్​ఆర్​ అలైన్ ​మెంట్​పై చౌటుప్పల్​ ఆర్డీవో శేఖర్​రెడ్డికి ఫోన్​చేశారు. తను సీఎంతో మాట్లాడతానని, అప్పటివరకూ రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రిపుల్​ఆర్​విషయంలో పరిస్థితి చేయిదాటి పోయిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ తనకు మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడుతానని చెప్పారు. 

అసెంబ్లీ సమావేశాల్లో సీఎంతోనూ చర్చిస్తానన్నారు. అలైన్​మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ‘ దీన్ని ఆపాలంటే పెద్ద కురుక్షేత యుద్ధమే చేయాలి.. నాతో పరిష్కారం కాకుంటే ఎవరితోనూ కాదు’ అని పేర్కొన్నారు.  పనులు ప్రారంభం కానందున  కోర్టుకు పోదామని,  భూమిని నమ్ముకొని బతికే వాళ్లకు అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. అలైన్​మెంట్ మారని పక్షంలో ఎక్కువ పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని, తనపై నమ్మకం ఉంచాలని ఆయన రైతులను కోరారు.