రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో సుపరిపాలన

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో సుపరిపాలన

మేడ్చల్ జిల్లా : కుటుంబ, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ మురళీధర్ రావు కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే.. సుపరిపాలన ప్రజలకు అందుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పరిపాలనను అంతమొందించడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగానే 'గిరిజన బంధు' ఇస్తా అంటున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని, ఇప్పుడే ఆ హామీ ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. 

దమ్మాయిగూడ జవహర్ నగర్ లో రోడ్లు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని, ఒక్కో అడుగు తీసి వేస్తుంటే దుమ్ము లేస్తోందని మురళీధర్ రావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్ తరహాలో మారుస్తానని చెప్పిన కేసీఆర్.. జవహర్ నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులను ఏర్పరిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక సమస్య ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల బాగోగులపై ఏ మాత్రం శ్రద్ధ లేదన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి డంపింగ్ యార్డ్ ను మరో చోటకు తరలిస్తామని చెప్పారు. దమ్మాయిగూడలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సభలో మురళీధర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.