నవాబుల వైభవం..నిజాం మ్యూజియంలో

నవాబుల వైభవం..నిజాం మ్యూజియంలో

హిస్టారికల్ సిటీ హైదరాబాద్​లో హెరిటేజ్ మాన్యుమెంట్స్​కు కొదవ లేదు. ఎక్కడ చూసినా నగర చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తాయి. అవి ఆనాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు మనముందు ఉంచుతాయి. నిజంగా ఇది ఈ ప్రాంతవాసుల అదృష్టమే. గోల్కొండ, చార్మినార్, కుతుబ్​ షాహీ టూంబ్స్​తోపాటు వందలాది హిస్టారికల్ స్పాట్స్ ఉన్నాయి. మ్యూజియాల విషయానికి వస్తే సాలార్జంగ్, స్టేట్ మ్యూజియంలు చాలా మందికి తెలుసు. కానీ ఆరో నిజాం నివాసం, ఏడో నిజాం పుట్టిన ప్యాలెస్ గురించి మాత్రం కొందరికే తెలుసు.

ఆరో నిజాం ప్యాలెస్​ను స్థానికంగా పురానీ హవేలీ అని పిలుస్తారు. హవేలీలోని ఒక బిల్డింగును మ్యూజియంగా మార్చారు. అదే నిజాం మ్యూజియం. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వార్డ్​రోబ్ ఈ మ్యూజియంలో ఉంది. ఆరో నిజాం కాలంలోని ఈ వార్డ్​రోబ్176 ఫీట్ల వెడల్పుతో రెండు ఫ్లోర్లతో ఉంటుంది. అందులోని నాటి నవాబులు, రాణులు, యువరాణుల డ్రెస్సులు చూస్తే కళ్లు జిగేల్ మంటాయి. 

నేటికీ అవి ఫ్యాషన్ కావడం విశేషం. లేస్ వర్క్ రాణుల డ్రెస్ డిజైన్లు ఇప్పటికి ఫేమస్. ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడికి వచ్చి నాటి వర్క్ ఎలా ఉందో ఆసక్తిగా చూసి వెళ్తారు. రాజుల కాలం నాటి థీమ్​లతో వచ్చే సినిమాలకు వీటిని ఇన్​స్పిరేషన్​గా తీసుకునే కాస్ట్యూమ్స్ తయారు చేస్తారు. వీటితోపాటు నాటి రాచకుటుంబం వాడిన వివిధ రకాల వస్తువులు ఈ మ్యూజియంలో కొలువు దీరాయి. వాళ్ల హాబీల్లో భాగంగా సేకరించిన వస్తువులు కూడా అక్కడున్నాయి. అన్నింటికన్నా ఎలాంటి మెషినరీ లేకుండా చేతితో ఆపరేట్ చేసే చెక్క లిఫ్ట్ అన్నింటికన్నా హైలైట్.

బంగారం.. వెండి...

దశాబ్దాల నుంచి ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్ధం ఉంది. కాకపోతే ప్రచారం తక్కువ. అందుకే దీని గురించి తక్కువ మందికి తెలుసు. అయితే మ్యూజియం, ఇతర ఆస్తులను నిర్వహిస్తున్న నిజాం జూబ్లీ పెవిలియన్ ట్రస్ట్ ఈ మధ్య దీన్ని రినొవేట్ చేసింది. దాంతో గతంలో దుమ్మూ ధూళితో ఉండే మ్యూజియం కాస్తా ఇప్పుడు మెరిసిపోతోంది. మ్యూజియానికి సందర్శకులను పెంచి నాటి చరిత్రను నేటి తరానికి పరిచయం చేసేందుకు ట్రస్టు ప్రయత్నిస్తోంది. మ్యూజియంలో ఇంకే వస్తువులున్నాయో చూద్దాం..

నిజాం రాజు1940లోనే అత్యంత ధనవంతుడిగా గుర్తించబడ్డారు. ఆయన ఉమ్మివేసే పాత్ర కూడా వెండిదే! ఒక్కటేమిటి... సిగరెట్ కేసులు, టిఫిన్ బాక్సులు, హుక్కా పాట్లు అన్నీ బంగారువే. ఏ వస్తువైనా నచ్చితే అది ఆయన వద్ద ఉండాల్సిందే. కొన్నింటిని అవసరాలకోసం వాడితే, మరికొన్నిటిని ఫ్యాషన్ కోసం వాడేవారు. ఫ్యాషన్ కోసం ఖరీదైన వాకింగ్ స్టిక్స్​ వాడేవారు. ఒక్కో వాకింగ్ స్టిక్​కు ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఒకదానికి డైమండ్స్ పొదిగి ఉంటే మరికొన్ని వివిధ రూపాల్లో డిఫరెంట్​ లుక్​లో గోల్డ్ అంచులతో ఉన్నాయి. నిజాం కుటుంబం టీ తాగే కప్పు, సాసర్లు కూడా డైమండ్స్ అలంకరణగా అద్దిన బంగారువే. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్​లో నవాబు కూర్చున్న గోల్డ్ కోటెడ్ చైర్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. వీటితో పాటు డైమండ్స్, ప్లాటినం, గోల్డ్​తో చేసిన ఆల్ ఇన్ వన్ థర్మామీటర్,  క్లాక్, హ్యుమిడిటీ గేజ్ ఉంది. అలాగే అసఫ్ జాహీ, కుతుబ్​షాహీ, బహమని కాలం నాటి కాయిన్స్, పోస్టల్ స్టాంపులు ప్రదర్శనలో ఉన్నాయి. 

నిజాం రాజు ఫుడ్ తీసుకోవడానికి చైనా కాలిడాన్​ ప్లేట్స్​ వాడేవారు. ఒకవేళ ఆ ప్లేట్లో  విషం కలిసిన ఫుడ్ వడ్డిస్తే ఫుడ్ కలర్ మారుతుంది లేక ఆ ప్లేట్ విరిగిపోతుంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్3డీ పిక్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వజ్రాలతో పొదిగిన ఈ పిక్చర్ ఏవైపు నుంచి చూసినా... ఆ వైపుకే చూస్తున్నట్లు కనిపిస్తుంది. 

పాల్వంచ రాజు నిజాం రాజుకు ఇచ్చిన  శ్రీకృష్ణుడు, గోపికలతో ఉన్న జమ్మిచెట్టు ఆకారపు వెండి బహుమతి, నాందేడ్ గురుద్వారా నుంచి ఇచ్చిన సిల్వర్ చక్ర కనిపిస్తాయి ఇక్కడ. ఆ కాలంలో మత సామరస్యం ఎలా వెల్లివిరిసిందో వాటిని చూస్తే అర్థం అవుతుంది.1965లో చైనాతో యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి పిలుపు మేరకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేషనల్ డిఫెన్స్ ఫండ్​కు ఐదువేల కిలోల గోల్డ్​ను విరాళంగా ఇచ్చినప్పటి ఫొటో ఉంది. నిజాం కాలంనాటి ప్రతి నిర్మాణానికి గోల్డ్, వెండి మోడల్స్ చేయించేవారు. అలా ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, షాహ్​​గఢ్ బ్రిడ్జి(మహారాష్ట్ర), మొజాంజాహీ మార్కెట్, జూబ్లీహాల్ తదితర కట్టడాలకు సంబంధించిన గోల్డ్, వెండి మోడల్స్ ఉన్నాయి. శంకుస్థాపన చేయడానికి గోల్డ్, సిల్వర్ తాపీలు, గంపలు వాడేవారు. అవి కూడా మ్యూజియంలో ఉంచారు.

పిల్లలకు ఫ్రీ

ప్రతి శుక్రవారం ఈ మ్యూజియం మూసి ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4.45 వరకు తెరచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు..15 ఏండ్లలోపు పిల్లలకు ఫ్రీ, పెద్దలకు రూ.125. కెమెరాతో ఫొటోలు తీసుకోవాలంటే రూ.150 అదనంగా చెల్లించాలి.

పోతరాజు వెంకన్న 
ఫొటోలు : ఎన్. శివకుమార్