మ్యూజిక్ విలేజ్.. చూసేద్దాం పదండీ

మ్యూజిక్ విలేజ్.. చూసేద్దాం పదండీ

ఎర్నెన్... స్విట్జర్లాండ్​లోని గోమ్స్ జిల్లాలో ఉంది. ఈ ఊరు చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడి ఇళ్లు, హోటళ్లు వాటి ఆర్కిటెక్చర్​తో కట్టిపడేస్తాయి. ఆ ఆర్కిటెక్చర్​ డిజైన్ ట్రెడిషనల్​గా ఉండడంతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తుంటే.. ఇక్కడి వాళ్లు అందుకు భిన్నంగా బతుకుతున్నారు. చాలా ఏండ్లుగా వాళ్ల ఆర్కిటెక్చర్​ ఆర్ట్​ను కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే దాన్ని ఆర్కిటెక్చరల్​ హెరిటేజ్​గా గుర్తించి ‘వాక్కర్ ప్రైజ్’తో సత్కరించింది స్విట్జర్లాండ్​ గవర్నమెంట్.

ఎర్నెన్​ని మొదట1214లో ‘అరగ్నన్’ అని పిలిచేవాళ్లు.1220లో ఆ పేరునే ‘అరెంగ్నన్’ అన్నారు. ఆ తర్వాత చాలా ఏండ్లకు1510లో మళ్లీ దాని పేరు మారింది. అప్పుడు దాన్ని ‘అయెర్నెన్’ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ‘ఎర్నెన్’​ అని పిలుస్తున్నారు. అదెలావచ్చిందంటే... ఈ ఊరు కొండల మధ్యలో ఉన్న లోయ ప్రాంతంలో ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే... రోన్​ అనే నదికి ఎడమవైపున పై భాగంలో ఉంటుంది. ఇక్కడ నివసించే  జనాభా చాలా తక్కువ. డిసెంబర్ 2020 నాటికి ఇక్కడి జనాభా 518 మాత్రమే. ఇళ్లు కూడా ఒకే వరుసలో కాకుండా అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి.

ఈ ఇండ్లకి సమీపంలో పెద్ద పెద్ద చెట్లతో నిండిన దట్టమైన అడవి కనిపిస్తుంటుంది. కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటారు. మిగతా భూమి ఖాళీగా ఉంటుంది. అయితే, 2005లో ఈ ఊరిని మున్సిపాలిటీ చేశారు. ఆ తర్వాత 2014లో దీనికి ముందు ఉన్న స్టెయిన్​హాస్, అస్సెర్బిన్​, ముహ్లెబాచ్​ మున్సిపాలిటీలను కూడా ఎర్నెన్​లో కలిపేశారు. అప్పటి నుంచి దీని పేరు ఎర్నెన్​గా ఉంది. మరో విషయం... ఇక్కడి వాళ్లు ఎన్నికల్లో ఓట్లు కూడా వేస్తారు. వీళ్లలో 87 శాతం మంది రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తారు. అలాగే ఆరు శాతం మంది స్విస్ రిఫార్మ్​డ్ ‌ చర్చికి వెళ్తారు. మిగతా వాళ్లు అసలు దేవుడినే నమ్మరు.  

ఇన్ని భాషలా?

సాధారణంగా ఎక్కడైనా ఒక కమ్యూనిటీ తీసుకుంటే అందులో ఐదు వందలో, వెయ్యి మందో ప్రజలు ఉంటారు. వాళ్లంతా ఒకటే భాష మాట్లాడుకుంటారు. లేదంటే ఇంకో భాష అదనంగా మాట్లాడతారేమో. ఇక్కడ మాత్రం ఒకే చోట ఉండేవాళ్లు నాలుగైదు భాషలు మాట్లాడతారు. వలస వెళ్లిన వాళ్లు ఉంటే ఇలానే మనుషులు తక్కువైనా భాషలు ఎక్కువ ఉంటాయని తెలిసిందే. అయితే, ఇక్కడికి వచ్చే వాళ్లకంటే, ఇక్కడి నుంచి బయటకు వలస వెళ్లే వాళ్లే ఎక్కువ. అయినా ఇక్కడి వాళ్లు రకరకాల భాషలు మాట్లాడగలగడం చెప్పుకోదగ్గ విషయం. 2000వ సంవత్సరంలో 95 శాతం జర్మనీ భాష మాట్లాడేవాళ్లు. అప్పుడు అదే వాళ్ల ఫస్ట్​ లాంగ్వేజ్​. ఆ తర్వాత రకరకాల భాషలు వచ్చి చేరాయి. వాటిలో జర్మన్ తర్వాత మాట్లాడే రెండో భాష సెర్బో–క్రొయేషిన్. దీన్ని ఒక శాతం మాట్లాడతారు. వీళ్లు మాట్లాడే మూడో భాష డచ్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... మొన్నటి వరకు ఇద్దరు ఫ్రెంచ్​, ఒకరు ఇటాలియన్​ కూడా మాట్లాడేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య కూడా పెరిగి ఉండొచ్చు.

ఇల్లు - పెండ్లి

ఇక్కడి వాళ్లు కొన్ని ఇళ్లను ఉండటానికి మాత్రమే వాడి, మరికొన్నింటిని ఇతర పనుల కోసం కూడా వాడతారు. వాటితోపాటు ఇంకొన్ని అపార్ట్​మెంట్​లు కూడా ఉంటాయి. అయితే వాటిలో సగం ఖాళీగానే ఉంటాయి. ‘ది ఎర్నెన్​ గాల్గెన్’​, ‘ది జోస్ట్​ సిగ్రిస్టెన్ హౌస్’, ‘టెల్లెన్ హౌస్’ అనే ఇండ్లు స్విస్ హెరిటేజ్​ సైట్​ ఆఫ్​ నేషనల్ సిగ్నిఫికెన్స్​ లిస్ట్​లో ఎలిజిబిలిటీ పొందాయి. అంతేకాకుండా విలేజ్​ మొత్తం కలిపి ఇన్వెంటరీ ఆఫ్​ స్విస్​ హెరిటేజ్ సైట్​​గా గుర్తింపు తెచ్చుకుంది. 

ఇన్ని స్పెషాలిటీలు ఉన్న ఈ ఊళ్లో పెండ్లిళ్లు కూడా ప్రత్యేకమే. 2000 ఏడాది నాటికి162 మంది సింగిల్​గా ఉన్నారట. అలా ఎందుకు? అని మీకు డౌట్​ వచ్చిందా? సింపుల్​ వాళ్లకు పెండ్లి చేసుకోవడం నచ్చలేదు. అలాగే అప్పటి లెక్క ప్రకారం186 మంది పెండ్లైన వాళ్లు, 26 మంది వితంతువులు,11 మంది విడాకులు తీసుకున్న వాళ్లు ఉండేవాళ్లు. పిల్లలు లేని జంటలు 33 మంది ఉన్నారట. ఇక పిల్లల చదువు విషయానికొస్తే 2010 –2011 విద్యా సంవత్సరంలో19 మంది స్టూడెంట్స్​ మాత్రమే ఉన్నారు. అప్పట్లో అక్కడ కిండర్ గార్టెన్ క్లాసులు ఉండేవి కాదు. 

ఏమేం చేయొచ్చు

హైకింగ్ చేయడానికి పది అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి.. వాన్ మున్​స్టర్ నచ్ ఎర్నెన్, టూర్ బ్లిన్నెహార్న్, సర్క్యులార్ హైక్ వయా ఆస్పి–టిట్టర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండ్ గోమ్స్ బ్రిడ్జ్. అలాగే మౌంటెన్ బైకింగ్ చేయడానికి కూడా పది రూట్​లు ఉన్నాయి. వాటిపేర్లు స్టోన్ మ్యాన్ గ్లేసియర్​ మౌంటెన్ బైక్ రూట్, ఫియాచి నుంచి ఫ్రెయిచి రౌండ్ ట్రిప్ వంటివి. ఇక్కడికి సైక్లింగ్ చేస్తూ కూడా వెళ్లొచ్చు. 
తినడానికి, తాగడానికి కెఫె​లు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి వెళ్లేవాళ్లు చూడ్డానికి జోస్ట్ – సిగ్రిస్టెన్ మ్యూజియం, గోమ్స్ బ్రిడ్జ్​కి దగ్గర్లో ఉన్న కెఫె​, మ్యాజికల్ ఫారెస్ట్​ ఆఫ్​ వాజెన్, హిస్టారిక్ విలేజ్​ ముహ్లెబాచ్, ఊరికి మధ్యలో ఉన్న లా స్కలా ప్లే గ్రౌండ్ వంటివి చూడొచ్చు.   

విశాలమైన ప్రదేశం, ఎత్తైన, అందమైన భవనాలు, అడవి మధ్యలో అక్కడక్కడ కొన్ని ఇళ్లు. ప్రశాంత వాతావరణం, తక్కువ జనాభా, అక్కడికెళ్తే సంగీతాన్ని ఎంజాయ్​ చేస్తూ గడిపేయొచ్చు. ఈ ఊరూ... దాని పేరూ రెండు చిన్నవే. కానీ, స్విట్జర్లాండ్​లో అత్యంత అద్భుతమైన అనుభూతినిచ్చే ఊరు అది. మరి దాని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్​ సంగతులు తెలుసుకోవాలి కదా.

సంగీత ప్రియులు

ఎర్నెన్ విలేజ్​ 2016లో జులై– ఆగస్ట్ మధ్యలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్​కి ఆతిథ్యం ఇచ్చింది. ఈ కల్చర్​ని హంగేరియన్ పియానిస్ట్​, మ్యూజిక్ ప్రొఫెసర్ గ్యార్గీ సెబక్ అనే వ్యక్తి 1974లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా జూన్​ నుంచి ఆగస్ట్​ మధ్యలో అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. అతను దీన్ని మొదలుపెట్టడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే.. గ్యార్గీ సెబక్​ ఒకసారి భార్యతో కలిసి హాలిడేకి వెళ్లాడు. అలా వెళ్లిన వాళ్లు చాలా కాలం అక్కడే ఉన్నారు. రెండేండ్ల తర్వాత మొదటి సారి మాస్టర్ క్లాస్ పియానో, చాంబర్ మ్యూజిక్ హోస్ట్​ చేశాడు. మాస్టర్ క్లాసులు, కన్సర్ట్​ల వల్ల అక్కడ స్టూడెంట్స్ పెరిగారు. అలా అది మ్యూజిక్ ఫెస్టివల్​కి దారి తీసింది. దాని పేరు డెర్ జుకున్త్​​. అంటే భవిష్యత్​ కోసం జరుపుకునే పండుగ అని అర్థం.1999లో సెబక్​ చనిపోయేవరకు ఈ ఫెస్టివల్​  కొనసాగింది. ఆ తర్వాత మూడేండ్లు వేరే ఆర్టిస్టిక్ డైరెక్టర్స్ ఫెస్టివల్​ని జరిపించారు. 2004లో ఫ్రాన్సెస్కో వాల్టర్ ఆ పొజిషన్​కి వచ్చాక అతనే చూసుకునేవాడు. అప్పుడు ఫెస్టివల్​ టైంతోపాటు ఆడియెన్స్​ కూడా పెరిగారు. అలా 2012లో ఈ ఫెస్టివల్​కి ముసిక్​డోర్ఫ్​ ఎర్నెన్​ అని పేరు పెట్టారు. 2013లో ఈ ఫెస్టివల్​కి ప్రిక్స్ మాంటాగ్నే, 2015లో డోరోన్ ప్రైజ్ వంటి అవార్డ్​లు దక్కాయి. సంగీతంలో పాపులర్ అయింది కాబట్టి దీన్ని ‘మ్యూజిక్ విలేజ్’​ అని కూడా పిలుస్తారు.

ఇలా వెళ్లాలి

స్విట్జర్లాండ్​లోని అతిపెద్ద నగరమైన జ్యూరిచ్​కి వెళ్లాలి. అక్కడి నుంచి ఎర్నెన్​ వెళ్లడానికి మూడు రైలు మార్గాలు ఉన్నాయి. అలాగే కారులో కూడా వెళ్లొచ్చు. రైల్లో వెళ్తే 3 గంటలకు పైగా టైం పడుతుంది. వీకెండ్​లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.