సిటీలో కల్తీ మాంసం అమ్మకాలు ఇష్టారీతిగా జరుగుతున్నాయి. చనిపోయిన, రోగాల బారినపడిన గొర్రెలు, మేకలన కోసి అమ్ముతున్నారు కొందరు వ్యాపారులు. మటన్ షాపులకు, హోటళ్లకు వేల టన్నుల కల్తీ మాంసం సప్లయ్ అవుతున్నా… బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. స్లాటర్ హౌజ్ లో కట్ చేసిన మాంసాన్నే వ్యాపారులు అమ్మాలన్న నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు.
సిటీలో రోజు రోజుకు మాంసం అమ్మకాలు పెరుగుతున్నాయి. కోటికిపైగా జనాభా ఉన్న నగరంలో ఎక్కువగా గొర్రె, మేక మాంసం తినేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చేపలు, కోళ్ల మాంసం కూడా రోజు వేల టన్నుల్లో అమ్ముతున్నారు.
జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు ఆమోదించిన మాంసాన్నే అమ్మాలి. కానీ సిటీలో ఎక్కడో ఒకటి, రెండు చోట్ల తప్ప.. మిగతా చోట్ల కల్తీ మాంసాన్నే అమ్ముతున్నారు వ్యాపారులు. వాస్తవానికి స్లాటర్ హౌజ్ లో కోసిన మాంసాన్నే కొనాలి. మేకలు, గొర్రెలు ఆరోగ్యస్థితిని డాక్టర్ పరీక్షించి తినొచ్చని నిర్ధారించిన తర్వాతే వాటిని కట్ చేయాలి. కానీ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ వ్యాపారులు మేకలు, గొర్రెలను పశువులను వదించి మాంసం అమ్ముతున్నారు.
సిటీలో చాలా మందికి స్టాంపు మాంసం అంటే తెలీదు. అదేంటని ప్రశ్నిస్తారు. రెగ్యులర్ గా వెళ్లే మటన్ షాపులోకి వెళ్లి నమ్మకంతో మాంసాన్ని తీసుకుంటున్నారు. కానీ అమ్మకందారులు మాత్రం వినియోగదారుల నమ్మకాన్నే క్యాష్ చేసుకుంటున్నారు. చనిపోయిన, రోగాల బారిన పడిన గొర్రెలు, మేకలను కట్ చేసి అమ్ముతున్నారు.
మరోవైపు కొందరు మటన్ షాపుల నిర్వాహకులు పాత డేట్ల స్లిప్ తోనే అమ్మకాలు చేస్తున్నారు.. ఇంకొందరు మాత్రం స్లాటర్ హౌజ్ లో 8 గొర్రెలు కట్ చేయించినట్లు రిసిప్ట్ తీసుకుంటే షాపుల్లో రెండింతల గొర్లను కట్ చేసి అమ్ముతున్నారు. అందులోనే రోగాల బారిన పడిన మేకలు, గొర్రెలను కూడా కోసి అమ్ముతున్నారు. చాలా వరకు మాంసం అమ్మకందారులే సొంతంగా స్టాంపులు తయారు చేసుకొని షాపుల దగ్గరే స్టాంపులు వేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సిటీలో రోడ్డు పక్కన ఉంటే మటన్ షాపులన్నీ నీట్ గా ఉండటం లేదు. వాహనాల రాకపోకలతో మటన్ పై దుమ్ముదూళీ పడుతోంది. మరోవైపు ఈగలు వాలడంతో అనారోగ్యాలు వస్తున్నాయంటున్నారు జనం.
జీహెచ్ఎంసీ అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మటన్ షాపులకు, హోటళ్లకు వేల టన్నుల కల్తీ మాంసం సప్లయ్ అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్లాటర్ హౌజ్ లో కట్ చేసే మాంసం కంటే అదనంగా ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు గుర్తించి.. కల్తీ మాంసంపై దృష్టి పెట్టాలని సిటీజనం కోరుతున్నారు.
