‘దేశం తరపున ఆడటమే నా గోల్’​

 ‘దేశం తరపున ఆడటమే  నా గోల్’​

ఓ వైపు పేదరికం.. మరోవైపు తనకిష్టమైన ఆట.. రెండింటికీ పొత్తు కుదరదన్నారు అంతా. కానీ, కలలకి పేదరికం అడ్డు కాదన్నది అతని​ మాట. అదే చేతల్లో చూపించాలనుకున్నాడు. గెలుపు కోసం అడుగేశాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగకుండా... గమ్యం చేరే వరకు అలుపు లేకుండా  ప్రయత్నించాడు. రాష్ట్ర స్థాయిలో హై జంప్​లో  గోల్డ్​ మెడల్​ గెలుచుకున్నాడు. ‘దేశం తరపున ఆడటమే నా గోల్’​ అంటున్న ఇతని పేరు సందీప్​ రాథోడ్. నిర్మల్​లో ఆఫీస్​ బాయ్​గా పని చేస్తున్న ఇతను అథ్లెట్​గా ఎలా మారాడంటే.. 

ప్రయత్నం గట్టిదైతే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన సందీప్​  వయసు ఇరవై ఏండ్లు. సొంతూరు నిర్మల్​ జిల్లా, కుబీర్​ మండలంలోని రంజని తండా. సందీప్​ తల్లిదండ్రులిద్దరూ తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. రోజంతా పొలంలో ఎంత కష్టం చేసినా.. వచ్చేది అరకొర ఆదాయమే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టమంటే దానికితోడు ముగ్గురు పిల్లల చదువు బాధ్యత ఉంది వాళ్ల మీద. అయినా సరే తాము పడుతున్న కష్టం.. తమ పిల్లలకి వద్దని  వాళ్లని చదివించారు. సందీప్​ కూడా చదువుకుంటూనే తల్లిదండ్రులకి చేదోడుగా పొలం పనులకి వెళ్లేవాడు. స్కూల్​ పూర్తయ్యాక పెండ్లిండ్లకి, ఫంక్షన్​లకి కేటరింగ్​కి వెళ్లేవాడు. తనకిష్టమైన ఆటల్ని ఆడేవాడు. ఆటలపై ఇష్టం ఎలా మొదలైందని అడిగితే.. చిన్నప్పట్నించీ జరిగిందంతా చెప్పుకొచ్చాడు సందీప్​. 

అదే నా కల 

మనపై మనకున్న నమ్మకమే.. మన మొదటి గెలుపు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా  నాపై నేను నమ్మకం ఉంచా. అదే నన్ను నా గమ్యానికి సగం దూరం తీసుకొచ్చింది. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దేశం తరపున మెడల్​ గెలవాలన్నదే నా కల. 

ఆటలంటే ఇష్టం

‘‘చిన్నప్పట్నించీ ఆటలంటే ఇష్టం. కబడ్డీ, రన్నింగ్, లాంగ్ జంప్​, హై జంప్.. ఇలా ​అన్నింట్లో ముందుండేవాడ్ని. బోలెడు ప్రైజ్​లు కూడా గెలుచుకున్నా. పెద్దయ్యాక దేశం తరపున ఆడతానని ఇంట్లో కూడా చెప్పేవాడ్ని. కానీ, దారి తెలియకుండా పరుగెలా? అందుకే ఆటల వైపు వెళ్లాలన్న ఆశ ఉన్నా.. దాన్ని  మనసుదాటి రానివ్వలేదు. అలాగని నా కలల్ని వదల్లేదు. మేమున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను చదువుకోవడమే గొప్ప విషయం. అలాంటిది చేతి ఖర్చులకి ఇంట్లో వాళ్లని డబ్బులు అడగాలంటే మనసొప్పలేదు. అందుకే డిగ్రీ చదివేటప్పుడు నిర్మల్ ఆఫీసర్స్ క్లబ్​లో ఆఫీస్​ బాయ్​గా చేరా. పొద్దున్నే కాలేజీకి వెళ్తూ.. సాయంత్రం ఆఫీస్​ బాయ్​ డ్యూటీ అన్నమాట. అక్కడే నాకు నిర్మల్​ జిల్లా పి.ఇ.టి భూమన్న కనిపించాడు. నేను మండల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు భూమన్నతో పరిచయం ఉంది. దాంతో ఆయనతో నాకు ఆటల వైపు వెళ్లాలని ఉందని చెప్పా. నా ప్యాషన్​ని అర్థం చేసుకుని ట్రైనింగ్​ ఇవ్వడం మొదలుపెట్టాడాయన. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో  రోజూ ఉదయం ఐదింటి నుంచి ఏడింటి వరకు లాంగ్ జంప్, హైజంప్, రన్నింగ్​లో ట్రైనింగ్ ఇచ్చారాయన.

ఇక్కడితో ఆగిపోవద్దని

లాంగ్​ జంప్​, హై జంప్​, రన్నింగ్​లో మండల స్థాయిలో చాలా కాంపిటీషన్స్​ గెలిచా. నా ప్రతిభ చూసి జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశాలు వచ్చాయి. వాటిల్లోనూ నన్ను నేను నిరూపించుకోవడంతో... ఈ మధ్య  రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టేట్ స్పోర్ట్స్ మీట్​లో హై జంప్​ కేటగిరీలో పాల్గొనే అవకాశం వచ్చింది. జిల్లా తరపున గోల్డ్ మెడల్​ వచ్చింది. ఆ క్షణం అనిపించింది.. ఇక్కడితో ఆగిపోవద్దు. ఇలాంటి మెడల్స్​ ఇంకా తెచ్చుకోవాలని.. అందుకే మరింత కష్టపడుతున్నా. అథ్లెట్​గా ఎదగాలంటే బలమైన తిండి తినాలి. ప్రత్యేకమైన​ డైట్​ ఫాలో అవ్వాలి. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల నేను దొరికిందే తింటున్నా. అయితే ఏ పోటీకెళ్లినా గెలుపు విషయంలో మాత్రం కాంప్రమైజ్​ కాను.  నాలాగా ఆటల వైపు రావాలనుకుంటున్న స్కూల్​  పిల్లలకి నిర్మల్​ ఆఫీసర్స్ క్లబ్ తరపున రన్నింగ్ , లాంగ్ జంప్, హై జంప్​లలో టెక్నిక్స్​ నేర్పిస్తున్నా. 
::: జల్ద మనోజ్​ కుమార్​, నిర్మల్, వెలుగు