ప్రతిభే ముఖ్యం.. నెపోటిజంపై నాగబాబు హాట్ కామెంట్స్

ప్రతిభే ముఖ్యం.. నెపోటిజంపై నాగబాబు హాట్ కామెంట్స్

హైదరాబాద్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి తర్వాత నెపోటిజంపై పెద్ద చర్చ జరుగుతోంది. హిందీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ట్రైలర్స్‌పై నెపోటిజం ప్రభావం పడుతోంది. టాలీవుడ్‌లో దీని ప్రభావం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలా మంది సూపర్‌‌ స్టార్స్ వారసత్వంగా వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు నెపోటిజం హాట్ కామెంట్స్ చేశారు. బంధు ప్రీతి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ వారసులైనా, మరెవరైనా సరే ప్రతిభ, ప్రజల ప్రేమ లేకుండా కెరీర్‌‌లో కొనసాగలేరన్నారు.

‘ఇతరులపై అసూయతో కొందరు నిరాధార ఆరోపణలు చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఏ యాక్టర్‌‌కైనా ప్రతిభ, దమ్ము, కష్టపడేతత్వం ఉంటే వాళ్లు స్టార్ హీరో అయిపోతారు. అలాగే వారి స్థానాన్ని కాపాడుకుంటారు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, స్టార్ కిడ్ అయినంత మాత్రాన సక్సెస్ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేం. మా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్, రామ్‌ చరణ్​ను ఉదాహరణగా తీసుకుందాం.. వాళ్లు జిమ్‌ల్లో చెమటను చిందించి, యాక్టింగ్ క్లాసెస్‌ల్లో నేర్చుకొని తమ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు లాంటి సూపర్‌‌స్టార్స్ కూడా స్టార్ ఫ్యామిలీల నుంచే వచ్చారు. కానీ వాళ్లు కూడా కష్టపడి ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్‌తోపాటు నటనలో తమదైన ముద్ర వేయగలిగారు’ అని నాగబాబు పేర్కొన్నారు.