- నాగార్జున సాగర్ కు భారీగా పెరిగిన వరద..16 గేట్ల ఎత్తి వేత
నల్గొండ/హాలియా, వెలుగు: కృష్ణా బేసిన్ లో భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరిగింది. దీంతో బుధవారం రాత్రి డ్యామ్ అధికారులు 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,29, 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1,62, 811 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను డ్యాం అధికారులు ప్రమాద హచ్చరికను జారీ చేసి అలర్ట్ చేశారు.
నదిలోకి దిగవద్దని, ఈత కొట్టవద్దని, చేపలు పట్టవద్దని మత్య్సకారులను, ప్రజలను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులు(312.0450) టీఎంసీలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 3321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పెరుగుతున్న వరద ఉదృతి
పులిచింతలకు ఎగువ వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాలు కురవడంతో సాగర్ గేట్లను ఎత్తడంతో పులిచింతలకు ప్రస్తుతం 1,21,091 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.మూడు గేట్ల ద్వారా 97,712 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.ఎగువ ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్క్కులకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు
నిండుకుండలా మూసీ
నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 654 అడుగులకు గాను 643.50 అడుగులకు చేరుకుంది.
