సాగర్ ఓటమిని నోముల కుటుంబం ఖాతాలో వేస్తాడు

సాగర్ ఓటమిని నోముల కుటుంబం ఖాతాలో వేస్తాడు


కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజం

నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో ఓటమిని టీఆర్ఎస్ ఓటమిగానో.. తన ఓటమిగానో భావించకుండా నోముల నర్సింహయ్య కుటుంబం ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రాజకీయ ప్రత్యర్దులయినా రాజకీయ సంప్రదాయం కాపాడ్డానికి కృషి చేశారని, అలాగే తెలంగాణ ప్రయోజనాల కోసం పి.జనార్దన్ రెడ్డి ఎంతో కొట్లాడారని పేర్కొన్నారు. 26 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పైన పి.జనార్థన్ రెడ్డి ఒంటికాలితో పోరాటం చేశాడని గుర్తు చేశారు. అలాగే సొంత పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతున్నాడంటూ పోరాడాడని వివరించారు. రాజశేఖర్ రెడ్డి ,చంద్రబాబు ,ఎన్టీఆర్ ఉన్నప్పుడు శాసనసభలో ప్రజల సమస్యలపై నోముల నర్సింహయ్య కొట్లాడే వాడని, నోముల నర్సింహయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరి 2018 లో గెలిచిన తర్వాత శాసనసభలో రెండు సంవత్సరాలలో ఒక్క సారి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, నోముల నర్సింహయ్య టిఆర్ఎస్ లో చేరిన తర్వాతనే ప్రజల నుండి కనుమరుగై పోయాడని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్ లో చేరిన తరువాత నోముల నర్సింహయ్య ను రాజకీయంగా కెసిఆర్ సమాధి చేశాడని ఆయన దుయ్యబట్టారు. ఆలుగడ్డలు అమ్ముకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని  మంత్రి చేసిన కేసీఆర్ నోముల నర్సింహయ్యను మంత్రి ఎందుకు చేయలేదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నోముల నర్సింహయ్య కుటుంబానికి తప్పించి మిగతా అందరి పేర్లు కేసీఆర్ పరిశీలించాడని, దీని ద్వారా ఆయన ఆత్మకు క్షోభించ లేదా అని అడుగుతున్నానన్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమైంది కాబట్టే నోముల నర్సింహయ్య కొడుకుకి టికెట్ ఇచ్చాడని, అది కూడా చివరి నిముషంలో నోముల నర్సింహయ్య కొడుకుకి టికెట్ ఎనౌన్స్ చేశాడన్నారు. నోముల నర్సింహయ్యను అవమానించి రాజకీయ సమాధి చేసిన కేసీఆర్ రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమిని నోముల నర్సింహయ్య కుటుంబం ఖాతాలో వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘రేపు నాగార్జునసాగర్ లో కేసీఆర్ పెట్టే బహిరంగ సభలో కరోనా నియమాలను.. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తారని ఆయన ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణను సాధించింది జానారెడ్డి అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించింన జానారెడ్డిని ఓడించాలని ఎందుకు కుట్రలు చేస్తున్నారు.. నాగార్జునసాగర్ లో 1000 కిలోమీటర్ల రోడ్లు.. 35 వేల ఇందిరమ్మ ఇళ్లు.. రెండు లక్షల ఎకరాలకు  నీళ్లు ఇచ్చింది జానారెడ్డి కాదా..’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 
శాసనసభను కేసీఆర్ కల్లు కాంపౌండ్ లా మార్చాడు
సీఎం కేసీఆర్ శానససభను కల్లు కాంపౌండ్ లా మార్చాడని ఎంపీ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. శాసనసభలో చర్చ లు లేవు ప్రజల సమస్యలు పరిష్కారాలు లేవు..రాజకీయ రేవ్ పార్టీ వేదికగా శాసనసభను మార్చాడు కేసీఆర్..గులాబీ వనంలో గంజాయి మొక్కలను పెంచి పోషించాడు కేసీఆర్..గులాబీ వనంలో ఉన్న గంజాయి మొక్కలను, చీడపీడలను జానారెడ్డి ఎత్తిచూపుతాడని కేసీఆర్ కక్ష కట్టాడు..కేసీఆర్ రెండోసారి సభ పెడుతున్నాడు అంటేనే ఓటమిని ఒప్పుకున్నాడు..’’అని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు కురిపించారు. జానారెడ్డి సవాల్ ను ఒప్పుకోకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడో రేపు సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణకు ఇప్పుడు ఒక పెద్ద దిక్కు కావాలి..జానారెడ్డి ఓడిపోతే ఆయనకు పోయేదేమీ లేదు..టీఆర్ఎస్ శ్రేణులకు నేను దండం పెట్టి చెబుతున్నా జానారెడ్డి ఓడిపోతే తెలంగాణ సమాజం ఒక పెద్దదిక్కును కోల్పోతుంది..జానారెడ్డి గారు గెలిస్తే నైతిక విలువలు గెలిచినట్లే..కెసిఆర్ రెండోసారి బహిరంగ సభకు ఎందుకు వస్తున్నాడు సమాధానం చెప్పమనండి..’’అని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.