నేను ప్రాణం పోసినవాళ్లు నన్నే చంపాలనుకుంటున్నారు

నేను ప్రాణం పోసినవాళ్లు నన్నే చంపాలనుకుంటున్నారు

‘అసలు ప్రచారమే చేయకుండా మీరు ప్రగతిభవన్‌లో ఉండండి, నేను గాంధీభవన్‌లో ఉంటా, బీజేపీవాళ్లు వాళ్ల ఆఫీసులో ఉండాలి. ఇట్లా ఎన్నికలు పెడదామని నేను సవాల్ చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ సవాల్ చేస్తున్నా’ అని నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి జానారెడ్డి అన్నారు. 

నామినేషన్ గడువు ముగుస్తుండటంతో శనివారం హాలియాలో జన గర్జన పేరుతో సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో జానారెడ్డి మాట్లాడారు. ‘నేను ప్రాణం పోసినవాళ్లు నన్నే చంపాలనుకుంటున్నారు. గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల కంటే సాగర్‌లో నేనే బాగా చేశా. రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కువ ఆయకట్టున్న సెగ్మెంట్‌గా నాగార్జునసాగర్‌ను మార్చాను. నేను ఆపితేనే ఇండ్లు కట్టలేకపోతే ఇక నువ్వు నీ ప్రభుత్వాన్ని ఏం నడుపుతావ్. నా మీద మాట్లాడే ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పాలి. జానారెడ్డి అంటే పెత్తందారు కాదు.. పోరాటయోధుడు. మండల వ్యవస్థకు ఆద్యుడు జానారెడ్డి. ఇది ఎవరికీ తెలీదు. కేసీఆర్‌కు తెలిసినా చెప్పడు. అజ్ఞాతంలో ఉన్నవాళ్లని బయటికి రప్పించి చర్చలు జరిపిన యోధుడిని నేను. నన్ను ప్రశ్నించే అర్హత మీకు ఉందా? ప్రజలు బుద్ధి చెబితే వాళ్లు తోకముడుచుకొని పారిపోతారు. మీ ఓటుతోనే మీరు బానిసలు కాదని నిరూపించుకోవాలని కోరుతున్నా. పదవులను అనుభవించాలని పోటీకి రాలేదు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతగా ఈ గెలుపును అందించి ఆత్మతృప్తి పొందాలని పోటీకి దిగా. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చావని కేసీఆర్‌కు అప్పుడే చెప్పా, అయినా వినిపించుకోలేదు. రెండోసారీ ఎన్నికల్లో లబ్ధి కోసం అవే హామీలిచ్చాడు. మైనార్టీ కోటా అనీ, గిరిజన కోటా పెంచుతామనీ, మూడెకరాలిస్తామని, డబుల్ బెడ్రూం అని చెప్పాడు. ఇవేవీ ఆచరణ సాధ్యం కాదు. ఒక్క ఇల్లు కట్టని సర్కారుకు బుద్ధిచెప్పడానికి ఒక్క ఓటు కూడా వేయోద్దు. 
నిరుద్యోగ భృతిని కరోనా సాకుతో మరో ఏడాదికి కూడా ఇవ్వడు. పాలమూరు ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తిచేస్తానని ఐదేళ్ల కింద చెప్పాడు. ఇప్పుడు ఆర్నెల్లు అంటున్నాడు, అదీ అయ్యేది కాదు. నెల్లికల్లు ప్రాజెక్టు కాంగ్రెస్ కన్నబిడ్డ. మంత్రసాని వచ్చి నా బిడ్డే అన్నట్లుగా కేసీఆర్ వచ్చి వేలుపెట్టి పోయిండు’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.