నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత..పోటెత్తిన పర్యాటకులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత..పోటెత్తిన పర్యాటకులు

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఆదివారం (ఆగస్టు24) మధ్యాహ్నానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4లక్షల 15వేల 401 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.40 అడుగులుగా ఉంది.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం  312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 297.1465టీఎంసీలుగా ఉంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టుమొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.ఇక ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.