సాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ కు వరద పోటు: 4.85 లక్షల ఇన్‌‌‌‌ఫ్లో..26 గేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ కు వరద పోటు: 4.85 లక్షల ఇన్‌‌‌‌ఫ్లో..26 గేట్ల ద్వారా నీటి విడుదల
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లోకి వరద నీరు పోటెత్తుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 4,85,877 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో అప్రమత్తమమైన ప్రాజెక్ట్‌‌‌‌ ఆఫీసర్లు 16 గేట్లను13 ఫీట్లు, 10 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 4,14,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండడంతో ఆఫీసర్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

సాగర్‌‌‌‌ రిజర్వాయర్ నుంచి రికార్డు స్థాయిలో వరద వస్తున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి సూచించారు. నది సమీపంలోకి మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ వెళ్లొద్దని చెప్పారు. సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583. 70 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తున్నారు. 

బుధవారం రాత్రి వరకు ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. సాగర్‌‌‌‌ నుంచి ప్రధాన జల విద్యుత్‌‌‌‌ కేంద్రం ద్వారా 33,008 క్యూసెక్కులు, ఎమ్మార్పీకి 2,400, ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌సీకి 300 కలిపి మొత్తం 4,64,409 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

జూరాల 44 గేట్లు ఓపెన్‌‌‌‌

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్టుకు 3.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. దీంతో 44 గేట్ల ద్వారా 3,22,757 క్యూసెక్కులు, లిఫ్ట్‌‌‌‌ కెనాల్‌‌‌‌ ద్వారా 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.