గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి :  నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/వంగూరు, వెలుగు :  గ్రామాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు, పంచాయతీ పాలకవర్గాలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జీ-రామ్‌‌‌‌‌‌‌‌జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, శాశ్వత ఆస్తుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి వాటి ప్రయోజనాలు ప్రజలకు దీర్ఘకాలం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులు , ప్రీ ప్రైమరీ తరగతులను పరిశీలించారు. పాఠశాలల నిర్మాణాలను ఆమోదించిన మ్యాప్‌‌‌‌‌‌‌‌లు, డిజైన్ల ప్రకారమే వేగంగా, నాణ్యతా లోపం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ దశ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆటలు, పాటల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా టీచర్లు బోధన అందించాలని, తరగతి గదుల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.