‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ

‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ

డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. వెరైటీ రోల్స్ ఎంచుకుంటూ.. కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకి రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య. అందులో భాగంగానే బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్‌‌ని సెలెక్ట్ చేసుకున్నాడు ‘కృష్ణ వ్రింద విహారి’ కోసం. మరి అతని ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? తన ఖాతాలో హిట్టు పడిందా లేదా?

కథేమిటంటే.. 

కృష్ణాచారి (నాగశౌర్య) సంప్రదాయాలు పాటించే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) మాట అంటే అతడికి మాత్రమే కాదు, ఆ ఊరిలో అందరికీ వేదవాక్కే. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం సిటీకి వెళ్లిన కృష్ణాచారికి ఆ ఆఫీసులో ఉన్నత పదవిలో ఉన్న వ్రింద శర్మ (షెర్లీ) తెగ నచ్చేస్తుంది. వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడతాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. తనకు పిల్లలు పుట్టరని, ఆ విషయం ముందే ఇంట్లో చెప్పి ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటానని అంటుంది. దానికి సరే అని చెప్పిన కృష్ణాచారి.. ఆమె లోపాన్ని తనమీద వేసుకుని, ఇంట్లోవాళ్లని ఒప్పించి పెళ్లి చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అతను చెప్పిన అబద్ధం గురించి అందరికీ తెలిసిందా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..

ఒక మోడర్న్ అమ్మాయి, ఓ ట్రెడిషనల్ అబ్బాయిల మధ్య ప్రేమకథలు ఇప్పటికే చాలా చూశాం. ఇదీ అలాంటిదే. కాకపోతే ట్రీట్‌మెంట్‌లో కాస్త  హ్యూమర్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. దాంతో కొన్నిచోట్ల నవ్వులు బాగానే పూశాయి. మంచి పాయింట్ ఎంచుకున్నాడు. నార్త్ ఇండియాలో మోడర్న్ కల్చర్‌‌లో పెరిగిన అమ్మాయి, సంప్రదాయాల మధ్య పెరిగిన అబ్బాయి ఇంటికి కోడలిగా వస్తే ఎదురయ్యే కష్టాలను చూపించాలని ప్రయత్నించాడు. అయితే అందుకు అవసరమైన ఎమోషన్స్, మలుపుల్ని సమకూర్చుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌లో స్టోరీ రివీల్ కాకపోవడంతో ఇదేం లవ్‌ స్టోరీరా అనిపిస్తుంది. ఇంత రొటీన్ సినిమా చూడటం అవసరమా అనే ఫీల్ కూడా వస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ దగ్గర అసలు కథ రివీల్ అయ్యాక సెకెండాఫ్ మీద హోప్స్ పెరుగుతాయి. అయితే పాయింట్ తెలిసిందే కావడం, నేరేషన్‌ మళ్లీ ఫ్లాట్ అయిపోవడంతో ద్వితీయార్థంలోనూ ఆశాభంగం తప్పదు.  చెప్పాలంటే ఇదేమీ మరీ కొత్త పాయింట్ కాదు. ఇటీవలే వచ్చిన ‘అంటే సుందరానికీ’ చిత్రం కూడా ఇలాంటి సబ్జెక్టే. హీరోయిన్‌కి లోపం ఉండటం, హీరో దాన్ని తనమీద వేసుకోవడం, తర్వాత విషయం తెలిసి ఇంట్లోవాళ్ల ద్వారా సమస్యలు రావడం.. ఇదంతా చూసిన కథే. అయితే అక్కడ తండ్రితో వచ్చిన సమస్యలు ఈ సినిమాలో తల్లితో వచ్చాయంతే. 

ఒక సినిమా చూడగానే ఇంకో సినిమా గుర్తొచ్చిందంటేనే ప్రేక్షకుడు నిరాశపడిపోతాడు. అలాంటిది కొన్ని వందలసార్లు లేని ప్రేమ సన్నివేశాలు.. హీరోయిన్ వెనకాల హీరో పడే రొటీన్ సీన్లు.. అతని ఆరాటం చూసి హీరోయిన్‌ కూడా ఓకే అనేయడం.. అతను ఆనందంతో పొంగిపోవడం లాంటివి చూపించి ముందే నీరసం తెప్పించారు. ఆ తర్వాత వేరే సినిమాలో ఈ మధ్యనే చూసిన ట్విస్టును మళ్లీ చూపించి ఉన్న కాస్త ఆసక్తినీ చంపేశారు. సెకెండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ సీన్లు అయితే మనల్ని బైటికి వెళ్లిపోవడానికి ప్రేరేపిస్తుంటాయి కూడా. ఇలాంటి కథనాలు బోర్ కొట్టేసి చాలా కాలమైందని తెలిసి కూడా మళ్లీ వాటినే ఆశ్రయించడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. అయితే ఈ మొత్తంలో మెచ్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే.. కామెడీ. అక్కడక్కడా అది కాస్త వర్కవుట్ కావడంతో రిలీఫ్ అవస్తుంది. అలా అని ఓ రేంజ్‌లో ఊహిస్తే పొరపాటు. సుడిగుండంలో చిక్కుకున్నవాడికి దూరంగా ఓ తెప్ప కనిపిస్తే ఎలా ఉంటుందో అంతే. అది ఉందని ఆనందపడాలో తెలీదు, అది మనల్ని కాపాడలేదని తెలిసి బాధపడాలో అర్థం కాదు. అదీ సంగతి.

ఎవరెలా చేశారంటే..

బ్రాహ్మణ కుర్రాడి పాత్ర అనగానే మొదట గుర్తొచ్చేది ‘అదుర్స్’లో ఎన్టీఆర్. ఆ క్యారెక్టర్‌‌కి తనో మార్క్ క్రియేట్ చేశాడు. దాంతో ఎవరు ఆ పాత్ర పోషించినా కంపేరిజన్ కామన్. ఈ సినిమా విషయంలోనూ అది జరిగింది. అయితే పోలికల్ని పక్కన పెడితే నాగశౌర్య బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. చాలా ఈజ్‌తో నటించాడు. నటనలో మెచ్యూరిటీని కనబరిచాడు. తనలో ఓ మంచి నటుడున్నాడని, మంచి పాత్ర దొరికితే అదరగొట్టేస్తాడనే నమ్మకాన్ని కలిగించాడు. లుక్స్ పరంగానూ బాగున్నాడు. షెర్లీ కూడా బాగుంది. మరీ చిన్నపిల్లలా కనిపించిందనే తప్ప పాత్ర వరకు న్యాయం చేసింది. రాధిక పాత్ర సినిమాకి ప్లస్. చాదస్తం కలిగిన అత్తగారి క్యారెక్టర్‌‌లో తనదైన శైలిలో మెప్పించారామె. అయితే కొన్నిచోట్ల కాస్త అతి అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అది కూడా ఆవిడ నటన వల్ల కాదు.. క్యారెక్టరయిజేషన్ వల్ల మాత్రమే. ఇక సత్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీల కామెడీ మెప్పించింది. రాహుల్ రామకృష్ణకి మరోసాని టాలెంట్‌కి తగని పాత్ర దక్కింది. అతనిని సరిగ్గా వాడుకోలేదనిపించింది. 

టెక్నికల్‌ విషయాలకొస్తే.. మహతి స్వరసాగర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. అయితే తాను ఇవ్వగలిగినంత బెస్ట్ మ్యూజిక్ ఇవ్వలేదని చెప్పొచ్చు. పాటలు సూపర్‌‌గానూ లేవు, తీసి పారేసేలానూ లేవు. బ్యాగ్రౌండ్‌ స్కోర్ కూడా అంతంతమాత్రమే. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్టర్స్‌ అందర్నీ అందంగా చూపించడంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యాడు. శౌర్య సొంత బ్యానర్ కావడంతో ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. విజువల్స్, లొకేషన్స్ చూడగానే మంచి ఫీల్ వచ్చింది. రైటింగే ఇంకాస్త బెటర్‌‌గా ఉంటే బాగుండేది. తెలిసిన పాయింటే అయినా ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటే నడిచిపోతుంది. ఇక్కడ కథ, కథనాలు రెండూ వీక్‌గానే ఉండటంతో అనుకున్నస్థాయిలో అవుట్‌పుట్ రాలేదు. 


నటీనటులు : నాగశౌర్య, షెర్లీ సేతియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ,  సత్య, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ త‌దిత‌రులు 
సంగీతం: మహతి స్వరసాగర్
సమర్పణ : శంకర్ ప్రసాద్ మూల్పూరి 
నిర్మాత : ఉషా మూల్పూరి 
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ