సైబర్ ఉచ్చులో నగ్మా.. KYC పేరుతో రూ.లక్ష చోరీ

సైబర్ ఉచ్చులో నగ్మా.. KYC పేరుతో రూ.లక్ష చోరీ

సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరికీ కుచ్చు టోపీలు పెడుతున్నారు. అకౌంట్ లో డబ్బును ఖాళీ చేస్తున్నారు. తాజాగా నటి నగ్మాకు ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బ్యాంకు కేవైసీ పేరుతో రూ.లక్ష నగ్మా అకౌంట్ నుంచి కాజేశారు. తన మొబైల్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో డబ్బులు పోగొట్టుకుంది.

నగ్మా మొబైల్ కు ఫిబ్రవరి 28న బ్యాంక్ వాళ్లు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో ‘మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి కావాలంటే కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండ’ని ఉంది. ఆ మెసేజ్ నిజమేనని నమ్మిన నగ్మా లింక్ పై క్లిక్ చేసింది. లింక్ ఓపెన్ చేయగానే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. అందులో కేవైసీ అప్ డేట్ చేయాలి, బ్యాంక్ వివరాలు, ఓటీపీ చెప్పాలని కోరగా.. అతను అడిగిన వివరాలన్నీ నగ్మా చెప్పింది. ఆ డిటైల్స్ తో అతను ఆన్‌లైన్‌ బ్యాంకులోకి లాగిన్‌ అయి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని రూ.లక్ష  అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 

అతను లాగిన్ అయిన టైంలో తన మొబైల్ కి 20 ఓటీపీలు వచ్చాయని నగ్మా తెలిపింది. నగ్మా లాగానే ఆ బ్యాంకులో ఖాతాలున్న మరో 80 మందిని  కూడా  ఇదే తరహాలో మోసచేశారు ఆ కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముంబై సైబర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.