నాగోబా జాతరకు వేలాదిగా తరలిరానున్న ఆదివాసీలు

నాగోబా జాతరకు వేలాదిగా తరలిరానున్న ఆదివాసీలు
  • ఇయ్యాల అర్ధరాత్రి మహాపూజ
  • జాతరకు వేలాదిగా తరలిరానున్న ఆదివాసీలు

ఆదిలాబాద్,వెలుగు: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు అంతా రెడీ అయ్యింది. శనివారం అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమయ్యే వేడుక కోసం మెస్రం వంశీయులు, ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. 

అభిషేకంతో జాతర ప్రారంభం..

కాలినడకన 80 కిలో మీటర్ల దూరంలోని జన్నారం మండలంలోని కలమడుగు హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గోదావరి జలాన్ని పుష్య అమావాస్యకు ఒకరోజు ముందు కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద ఉంచుతారు. ఆ తర్వాతిరోజు అర్ధరాత్రి మెస్రం వంశీయులు రహస్యంగా పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులు పూజలు చేస్తారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​నుంచి ఆదివాసీలు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రధాన్ కితకు చెందిన మెస్రం రామ, గంగారాంలు సంప్రదాయ ఆదివాసీ వాయిద్యం కిక్రీ వాయిస్తూ నాగోబా, మెస్రం వంశ చరిత్ర వినిపిస్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, బయో టాయిలెట్లు, అత్యవసర వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ఈ రూట్​లో వెళ్లే ప్రతీ బస్సును కేస్లాపూర్ మీదుగా నడుపనున్నారు. 

70 ఏళ్లుగా దర్బార్...

నాగోబా జాతర చివరి రోజు జరిగే దర్బార్​తో జాతర ముగుస్తుంది. జాతరకు నలుమూల నుంచి వేల సంఖ్యలో వస్తున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో దర్బార్ ఏర్పాటు చేస్తారు. ఈనెల 24న కలెక్టర్ సిక్తా పట్నాయక్​ అధ్యక్షతన దర్బార్​నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు హాజరవుతారు. దీనికోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా..ఏటా దర్బార్ లో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.