BAN vs SL: చరిత్ర సృష్టించిన శాంటో.. బ్రాడ్‌మన్, గవాస్కర్, కోహ్లీల సరసన బంగ్లా కెప్టెన్

BAN vs SL: చరిత్ర సృష్టించిన శాంటో.. బ్రాడ్‌మన్, గవాస్కర్, కోహ్లీల సరసన బంగ్లా కెప్టెన్

గాలే వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో దుమ్ములేపాడు. లంక బౌలర్లపై చెలరేగుతూ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేశాడు. తొలి టెస్ట్ ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో శాంటో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా 199 బంతుల్లో శాంటో.. 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే టెస్టులో అంతకముందు తొలి ఇన్నింగ్స్ లోనూ 149 పరుగులు చేసి శతకం బాదాడు. దీంతో ఈ బంగ్లాదేశ్ కెప్టెన్ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలతో ఏకంగా బ్రాడ్‌మన్, గవాస్కర్, కోహ్లీల సరసన చేరాడు. 

టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన 16 వ కెప్టెన్ శాంటో. టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన శాంటో.. శ్రీలంకలో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. బ్రాడ్‌మన్, గవాస్కర్, కోహ్లీ లాంటి దిగ్గజాలు కెప్టెన్ గా రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ అందుకున్నారు. బ్రాడ్‌మన్ 1948లో భారత్‌పై ఈ ఘనత సాధించాడు. గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌పై.. అదే విధంగా కోహ్లీ 2014లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు బాదారు. 

ALSO READ | IND vs ENG 2025: 41 పరుగులకే చివరి 7 వికెట్లు.. 471 పరుగులకు టీమిండియా ఆలౌట్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో రెండో ఇనింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఐదు రోజుల ఆట అయిపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ముగించారు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో (148), ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌ (163) సెంచరీలకు తోడు లిటన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ (90) రాణించడంతో.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 495 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 485 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (125) రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదడం విశేషం. ఓపెనర్ షాదమన్ ఇస్లాం (76), రహీం(49) కీలక ఇన్నింగ్స్ ఆడారు.