
- టార్గెట్ కు మించి ఆదాయం
- జోరుగా క్రయవిక్రయాలు
- 15 మార్కెట్లలో 13కి ప్రాఫిట్
నల్గొండ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నూతన నిర్ణయాలతో వ్యవసాయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించడంతో మార్కెట్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. దీంతో పన్ను వసూళ్లతో మార్కెటింగ్ శాఖకు టార్గెట్ మించి ఆదాయం సమకూరింది. మార్కెట్లలో జరిగే పంట క్రయవిక్రయాలతోపాటు షాపుల అద్దెలు, చెక్ పోస్టుల ద్వారా ఆదాయం వస్తుండగా, జిల్లాలో ఎక్కువగా వరితోపాటు పత్తి సాగవుతుంది. ఇక పత్తి సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుండగా సివిల్ సప్లయ్ నుంచి మార్కెట్లకు ఆదాయం వస్తోంది. దీంతో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పెట్టుకున్న టార్గెట్ కు మించి ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
నల్గొండ జిల్లాలో 10 మార్కెట్లు..
నల్గొండ జిల్లాలో మొత్తం 10 అగ్రికల్చర్ మార్కెట్లు ఉన్నాయి. 2024 –-25 ఆర్థిక సంవత్సరంలో రూ.64.97 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకోగా, రూ.71.51 కోట్ల ఇన్కం వచ్చింది. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన లక్ష్యాన్ని దేవరకొండ మినహా మిగిలిన 9 వ్యవసాయ మార్కెట్లు అధిగమించాయి. అత్యధికంగా మిర్యాలగూడ మార్కెట్ కు ఆదాయం వచ్చింది. 2024 –-25 ఆర్థిక సంవత్సరంలో మిర్యాలగూడ మార్కెట్ కు రూ.28.32 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, రూ.30.85 కోట్లు వచ్చింది. మిర్యాలగూడ ప్రాంతంలో ఎక్కువగా రైస్ మిల్లులు ఉండడంతో అధిక లాభాలను తెచ్చిపెడుతోంది.
నల్గొండ వ్యవసాయ మార్కెట్ రూ.6.10 కోట్లు టార్గెట్ గా పెట్టుకోగా, రూ.6.46 కోట్లు, నకిరేకల్ మార్కెట్ రూ.4.62 కోట్ల టార్గెట్ కు రూ.5.74 కోట్లు, హాలియా రూ.3.16 కోట్లకు రూ.3.99 కోట్లు, నిడమనూరు రూ.3 కోట్లకు రూ.3.15 కోట్లు, చిట్యాల రూ.3.78 కోట్లకు రూ. 4.11 కోట్లు, చండూరు రూ.4 కోట్లకు రూ.4.63 కోట్లు, వీటినగర్ రూ.3.74 కోట్లకు రూ.4.20 కోట్లు, శాలిగౌరారం రూ.1.43 కోట్లకు రూ.1.57 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక దేవరకొండ మార్కెట్ మాత్రం రూ.6.79 కోట్లకు రూ. 6.57 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
సూర్యాపేట జిల్లాలో 6 మార్కెట్లు, రూ.32.02 కోట్ల టార్గెట్..
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, తుంగతుర్తి, నేరేడుచర్ల, హుజూర్ నగర్ లో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఈ ఆరు మార్కెట్లకు అధికారులు రూ.32.02 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. 2024 –- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.33.14 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన సూర్యాపేట మార్కెట్ రూ.10.57 కోట్ల టార్గెట్ కు రూ.13.11 కోట్ల ఆదాయం వచ్చింది. హుజూర్ నగర్ రూ.5.86 కోట్లకు రూ.5.45 కోట్లు, కోదాడ రూ.6.32 కోట్లకు రూ. 4.49 కోట్లు, తుంగతుర్తి రూ.2.25 కోట్లకు రూ.2.39 కోట్లు, నేరేడుచర్ల రూ.1.77 కోట్లకు రూ.1.99 కోట్లు, తిరుమలగిరి రూ.5.23 కోట్లకు రూ.5.67 కోట్ల ఆదాయం వచ్చింది.