కన్నబిడ్డ అమ్మకంపై మంత్రి సీతక్క సీరియస్

కన్నబిడ్డ అమ్మకంపై మంత్రి సీతక్క సీరియస్
  • ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు 

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ అమ్మకం ఘటనపై  రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే  నివేదిక అందించాలని మంగళవారం ఆదేశించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఇలాంటి  ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి సూచించారు.  పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌‌‌వాడీ, బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన దంపతులకు నాలుగోసారి కూడా పాప పుట్టగా కుటుంబానికి భారంగా మారుతుందని ఏపీలోని ఏలూరుకు చెందిన వ్యక్తులకు అమ్మేందుకు యత్నించిన ఘట న సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఐసీడీఎస్ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్, సీడబ్ల్యూసీ అధికారులు విచారణ చేపట్టారు.

చిన్నారిని స్టేట్ హోమ్ కు తరలించారు. ఆర్థికంగా ఇబ్బందుల కారణంగానే చిన్నారిని అమ్మేందుకు నిర్ణయించినట్టు తండ్రి చెప్పినట్టు తెలిసింది. దత్తతకు ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. పోలీసులు ఎంక్వైరీ ముమ్మరం చేశారు. తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.