- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్/ నకిరేకల్/ కట్టంగూర్(నకిరేకల్), వెలుగు: రైతులు విడతల వారీగా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై అధికారులు, మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల కొనుగోళ్లు సవాలుగా మారిందని, రైతులు ఒకేసారి వడ్లను తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, విడతల వారీగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సన్నధాన్యం కొనుగోలు విషయంలో తేమ, ఇతర అంశాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఏదైనా కారణం చేత పత్తిని అమ్మన్నట్లయితే స్లాట్ ను రద్దు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు, జిల్లా యంత్రాంగానికి, మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పోలీస్ శాఖ తరపున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి నకిరేకల్ మండలం చీమలగడ్డ, కట్టంగూరు మండలం ఐటిపాముల, కట్టంగూరు, రెడ్డి కాలనీల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
