రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మునుగోడు, వెలుగు: రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సీసీపీ ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు, మిల్లర్లతో మాట్లాడారు. 

తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు చెప్పారు.  మునుగోడు పత్తి కొనుగోలు కేంద్రం ముఖ్యమైందని ఎల్ 1 సెంటర్ గా ఉన్న ఈ కేంద్రంలో గతంలో  రైతులు ఇతర జిల్లాల నుంచి పత్తిని తీసుకువచ్చే వారన్నారు. ఒక సీజన్‌లో కపాస్ కిసాన్ యాప్‌లో  రైతు మూడు సార్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఏదైనా కారణం చేత బుక్ చేసుకున్న స్లాట్ ను క్యాన్సల్ చేసుకోవచ్చన్నారు. ఆ స్లాట్ అలాగే ఉంటుందన్నారు. 

ఈ రెండు మూడు రోజులు రైతులెవరు స్లాట్  ను బుక్ చేసుకోవద్దని, వర్షాలు తగ్గిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని, పత్తిని బాగా ఆరబెట్టి తీసుకురావాలన్నారు. డీసీసీబీ చైర్మన్  కుంభం శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి బాలాజీ నింజె, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపి కృష్ణ ,మార్కెటింగ్ ఏడీ చాయాదేవి, తదితరులు ఉన్నారు. 

వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి 

నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శుక్రవారం నల్గొండలోని తన చాంబర్లో రెవెన్యూ, పౌరసఫరాల, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి సరైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఎస్ఓ వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ,  జేడీఏ శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.