నల్గొండ అర్బన్, వెలుగు : బాలికను గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అదేవిధంగా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఆదేశించింది. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని బొట్టుగూడకు చెందిన చింతపల్లి నగేశ్వరసకు చెల్లి అయిన బాలికను లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు.. దీంతో బాలిక 7 నెలల గర్భవతి కాగా.. ఎవరికైనా చెబితే చంపుతానని అతడు బెదిరించాడు.
దీంతో బాధిత కుటుంబసభ్యులు 2021లో నల్గొండ వన్ టౌన్ పోలీసులకు కంప్లయింట్ చేయగా.. నిందితుడిపై అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ చేసిన కోర్టు నిందితుడికి జైలుశిక్ష, జరిమానా పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
