పొక్సో కేసుల్లో ఒకరికి 22, మరొకరికి 20 ఏళ్లు జైలు

పొక్సో కేసుల్లో ఒకరికి 22, మరొకరికి 20 ఏళ్లు జైలు

నల్గొండ అర్బన్, వెలుగు : బాలికలపై  లైంగిక దాడులకు పాల్పడిన ఇద్దరు నిందితులకు నల్గొండ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు గురువారం కఠిన శిక్షలు విధించింది.  ఒక కేసులో నిందితుడికి 22 ఏళ్ల జైలు, మరో కేసులో నిందితుడికి 20  ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానాలు కూడా విధించింది.  బాధిత బాలికల  కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న ఆదేశాలు జారీ చేసింది.  నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. చండూరు మండలం ధోనిపాముల గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై, అదే గ్రామానికి చెందిన తిప్పర్తి యాదయ్య 2016 డిసెంబర్ 18న లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లి చండూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్‌ షీట్ దాఖలు చేశారు. కోర్టు ఈ కేసులో నిందితుడికి 22 ఏండ్ల జైలు శిక్ష, రూ. 35 వేల జరిమానా విధించింది.  

బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని ఆదేశించింది. దేవరకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన ముకుటూజు భాస్కరాచారి అనే వ్యక్తి, 2018 మార్చి 10న అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. పోలీసులు పూర్తి దర్యాప్తు నిర్వహించి చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  బాధితురాలికి కూడా రూ. 10 లక్షల పరిహారం లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చెల్లించాలంటూ ఆదేశించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..  నిందితులకు శిక్షలు పడేలా సాక్ష్యాలు సమకూర్చి, చట్టబద్ధంగా న్యాయం జరిగేలా పనిచేసిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో నమోదైన 16 పోక్సో కేసుల్లో 17 మంది నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని ఎస్పీ తెలిపారు.