
- సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నాలు
- కోల్పోయిన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే పనిలో పీఆర్‌టీయూ
- తొలిసారి బోణీ కొట్టేందుకు టీపీయూఎస్ ఫైట్
- పీఆర్‌టీయూలో చీలిక.. ఎవరికి లాభమని జోరుగా చర్చ
నల్గొండ, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయూఎస్ సంఘాల మధ్య పోటీ వాడీవేడిగా సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నం చేస్తుండగా, ఈ సారైనా గెలిచి కోల్పోయిన స్థానాన్ని తిరికి నిలబెట్టుకోవాలని పీఆర్‌టీయూ పావులు కదుపుతోంది. మరో వైపు ఎలాగైనా బోణీ కొట్టాలన్న లక్ష్యంతో టీపీయూఎస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
పీఆర్‌టీయూలో చీలిక కలిసొచ్చేదెవరికో ?
గతంతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పీఆర్టీయూలో ఏర్పడిన చీలిక ఎవరికి కలిస్తొందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈసారి పీఆర్టీయూ రాష్ట్ర నేత శ్రీపాల్‌రెడ్డితో పాటు అదే సంఘంలో ఒకప్పుడు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఇండిపెండెంట్‌గా, పులి సరోత్తమ్ రెడ్డి టీపీయూఎస్ తరఫున, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండడంతో ఈ ప్రభావం ఎటువైపు దారి తీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత ఎన్నికల్లో పూల రవీందర్‌కు వ్యతిరేకంగా సరోత్తమ్‌రెడ్డి బరిలో ఉండడంతో ఓట్లు చీలి పరోక్షంగా యూటీఎఫ్ విజయానికి దోహదపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాటి ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ బీసీ, ఓసీ నినాదం బలంగా పనిచేయడంతో ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అదీగాక అప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన రవీందర్ బీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడం మరింత వివాదాస్పదమైంది.
తర్వాత రవీందర్ రెండోసారి పీఆర్టీయూ, బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేయగా అప్పుడు ఓటమి పాలయ్యారు. ఈ సారి పీఆర్‌టీయూ తరఫున శ్రీపాల్‌రెడ్డికి చాన్స్ దక్కడంతో రవీందర్ బీసీ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. జాక్టో మద్దతు ఇస్తున్న రవీందర్‌కు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఫ్రొపెసర్లు విశ్వేశ్వరరావు, బీసీ సంఘ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు.
దీనికి కౌంటర్‌గా బీజేపీ అనుబంధ సంఘమైన టీపీయూఎస్ తరఫున సరోత్తమ్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఓటర్లు డైలామాలో పడ్డారు. ఈ నలుగురు క్యాండిడేట్లు గతంలో పీఆర్టీయూలో కీలకపాత్ర పోషించడంతో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి ప్రతి రోజు నాలుగైదు మండలాలు చుట్టొస్తున్నారు.
సిట్టింగ్ స్థానం కోసం యూటీఎఫ్ పట్టు
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందకు యూటీఎఫ్ తీవ్రంగా శ్రమిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన అల్గుబెల్లి నర్సిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. గత ఆరేండ్ల పదవీకాలంలో ఎమ్మెల్సీ కోటా కింద వచ్చిన రూ.9 కోట్ల నిధుల్లో 96 శాతాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకే ఖర్చు చేశానంటూ చెబుతూ ప్రచారం చేస్తున్నారు.
అంతేకాకుండా తనకు వచ్చిన అలవెన్స్, జీతం పైసలు కూడా సంఘానికే డిపాజిట్ చేశానని, కేవలం పింఛన్ పైసలతోనే ఆరేండ్లు ఎమ్మెల్సీగా సేవ చేశానని గుర్తు చేస్తున్నారు. పీఆర్టీయూకు చెందిన నలుగురు క్యాండిడేట్లు పోటీలో ఉండడంతో పరిస్థితులు తనకే అనుకూలంగా మారుతున్నాయని ధీమాతో ఉన్నారు. ప్రత్యేకంగా బృందాలను నియమించి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. టీపీటీఎఫ్‌తో సహా లెక్చరర్లు, ఫ్రొపెసర్లు, గురుకులాల మద్దతు కూడగడుతున్నారు.
అందరి నినాదం ఒక్కటే..
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లంతా ఒకే నినాదాన్ని వినిపిస్తున్నారు. సీపీఎస్ రద్దు, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు ఇప్పిస్తామని, అందరు టీచర్లకు హెల్త్ కార్డులు ఇప్పిస్తామని, విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తామని హామీలు ఇస్తున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏల విడుదలకు చర్యలు తీసుకుంటామని, కేజీబీవీ టీచర్లకు టైమ్ స్కేల్ వర్తించేలా కృషి చేస్తామని, గురుకులాలు టైమింగ్‌లో మార్పులు తీసుకొస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.
దావత్‌లు, బంపర్ ఆఫర్లు
పగటి వేళల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్న క్యాండిడేట్లు, రాత్రి వేళల్లో రహస్య మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ టైంలో దావత్‌లు, విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలకు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఓటర్లను డైరెక్ట్‌గా కలిసేందుకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. ఎవరికి వారే గెలుపు తనదంటే తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి గెలిస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో యూటీఎఫ్ మరింత బలపడుతుందని ఆ సంఘం లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు పీఆర్టీయూ ప్రయత్నాలు చేస్తోంది.