
- నిందితుల వద్ద 17 తులాల గోల్డ్, 79 తులాల వెండి, 2 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం
- వివరాలను వెల్లడించిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్గొండ అర్బన్, వెలుగు : ఈజీగా మనీ సంపాదించాలని గంజాయి అమ్ముతూ.. ఆపై ఇండ్లల్లో చోరీలు చేస్తున్న నలుగురిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 2 కిలోల గంజాయి, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ రూ. 20 లక్షలకు పైగా ఉంటుంది. ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. గత జూన్ 30న నార్కట్ పల్లికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గాలి యాదయ్య తన ఇంట్లో 22 తులాల బంగారం, 80 తులాల వెండి చోరీ అయిందని పోలీసులకు కంప్లయింట్ చేశాడు. నార్కట్ పల్లి ఎస్ఐ సిబ్బందితో టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నార్కట్ పల్లి శివారులో రెడ్డయ్య ఫ్యాక్టరీ వద్ద వెంచర్లలో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అక్కడికి వెళ్లి.. నిందితులైన ఇద్దరు బాలురు, హైదరాబాద్ నాగోల్ కు చెందిన బాజపల్లి జోసెఫ్, ఎరిక్ విల్సన్ మెరీనాను అరెస్ట్ చేశారు. నాగోల్ కు చెందిన బోస్, ఒడిశాకు చెందిన మాలిక్ పరారీలో ఉన్నారు. వీరు గంజాయికి అలవాటు పడి చోరీలు చేస్తుండగా.. ఇప్పటికే 4 కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తుంటారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని నార్కట్ పల్లిలో బంధువుల వద్ద ఉంటూ చోరీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గంజాయి అమ్ముతుండడంతో పాటు రాత్రి పూట లాక్ చేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులకు ఎరిక్ విల్సన్, మెరీనా సహకరిస్తున్నా రు. నిందితుల వద్ద మారణాయుుధాలు కూడా ఉన్నాయి. కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్ పల్లి సీఐ కె. నాగరాజు,ఎస్ఐ క్రాంతి కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.