పార్కింగ్ చేసిన బండ్లు చోరీ..నిందితుడి అరెస్ట్

 పార్కింగ్ చేసిన బండ్లు చోరీ..నిందితుడి అరెస్ట్

నగరంలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుండి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీన పరుచుకుని రిమాండ్ కు తరలించారు. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జలగరి శ్రీనివాస్ అలియాస్ యాదగిరి చెడు వ్యసనాలకు అలవాటు పడి నగరంలో పార్కింగ్ చేసిన బైకులను దొంగతనాలకు పాల్పడుతూ గతంలో 16 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. 

అయినా కూడా తన తీరును మార్చుకోకుండా అదేవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిన్న కూడా ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడని అన్నారు. నల్లకుంట అంబుజా లేన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా నల్లకుంట పోలీసులకు చిక్కాడని చెప్పారు. ఆ తర్వాత తన నేరాలను ఒప్పుకున్నాడని..అతని వద్ద నుండి మూడు లక్షల యాబై వేలు విలువైన 5 బైకులను స్వాధీనపరచుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన నల్లకుంట పోలీసులను ఏసీపీ ఆకుల శ్రీనివాస్ అభినందించారు.