నంబాల డెడ్​బాడీ అప్పగించం

నంబాల డెడ్​బాడీ అప్పగించం
  • కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పిన చత్తీస్​గఢ్ పోలీసులు
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నంబాల సోదరుడు
  • కేశవరావుపై విష ప్రయోగం జరిగిందంటున్న పౌర హక్కుల నేతలు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవ రావు డెడ్​బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చత్తీస్​గఢ్ పోలీసులు నిరాకరించారు. అబూజ్​మడ్ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన మావోయిస్టుల డెడ్​బాడీలను ఆర్మీ హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. నంబాల డెడ్​బాడీ తీసుకునేందుకు అతని సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు నారాయణపూర్ వెళ్లారు. డెడ్​బాడీ చూయించకుండా వాళ్లను ఎస్పీ ఆఫీస్​లో నిర్బంధించినట్లు తెలిసింది. 

డెడ్​బాడీ ఇచ్చేది లేదని, వెంటనే నారాయణపూర్ వదిలివెళ్లిపోవాలని చెప్పినట్లు సమాచారం. డెడ్​బాడీ అప్పగింతపై పోలీసులను నిలదీయగా.. పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం ఎస్పీ ఫోన్ చేసి.. ‘‘చత్తీస్​గఢ్ ఎందుకు వెళ్లారు? వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి’’అని ఆదేశించినట్లు నంబాల సోదరుడు అన్నారు. దీంతో నంబాల డెడ్​బాడీ అప్పగింతపై శుక్రవారం ఆయన సోదరుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

నంబాలను బతికున్నప్పుడే పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి చంపారని, అందుకే డెడ్​బాడీ అప్పగించడం లేదని వామపక్ష పార్టీలు, పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నంబాలపై విషప్రయోగం జరిగిందని అంటున్నారు. డెడ్​బాడీ అప్పగిస్తే రీ పోస్ట్​మార్టం కోసం కోర్టుకు వెళ్తారన్న భయంతోనే మృతదేహం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. అలిపిరి బ్లాస్ట్​లో నంబాల సూత్రధారి. 

మంత్రి అచ్చెనాయుడు తన సొంత గ్రామానికి అతని డెడ్​బాడీ తీసుకురానివ్వకుండా అడ్డుపడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తున్నది. కాగా, నంబాల డెడ్​బాడీ వద్ద నుంచి ఆయన డైరీ, ల్యాప్​టాప్, ఇతర డాక్యుమెంట్లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ తీవ్రత, డీఆర్జీ బలగాల దూకుడుపై దళాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసినట్లు తెలుస్తున్నది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి అగ్రనేతలను దాటించే క్రమంలోనే నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​లో చనిపోయినట్లు తెలుస్తున్నది.