ఓట్లు గాయబ్ ..  ఓటరు కార్డులు ఉన్నా..లిస్టులో పేర్లు ఉండట్లే !

ఓట్లు గాయబ్ ..  ఓటరు కార్డులు ఉన్నా..లిస్టులో పేర్లు ఉండట్లే !

హైదరాబాద్, వెలుగు :   అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ టైమ్​ దగ్గర పడుతున్నా.. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటరు స్లిప్‌లు అందరికీ అందడం లేదు.  ఓటు ఎక్కడ ఉందోనని ఆన్‌లైన్‌లోనైనా చూసుకుందామంటే  డేటా నాట్ ఫౌండ్ అని వస్తుందని  హైదరాబాద్​, ఉమ్మడి రంగారెడ్డి ఓటర్లు చెబుతున్నారు. 1950 హెల్ప్ లైన్ నంబర్​కు కాల్ చేస్తే  ఆన్‌లైన్‌లో లేకపోతే ఓటు లేనట్టేనని అధికారులు వారికి చెబుతున్నారు. ఇంట్లో ఇంకెవరిదైనా ఓటరు కార్డు నంబర్ చెబితే బీఎల్ఓ నంబర్‌‌ ఇస్తాం..  కాల్ చేసి మాట్లాడండని సూచిస్తున్నారు. బీఎల్‌ఓలకు కాల్ చేస్తే .. ఇప్పుడేం చేయలేమని, ఎన్నికలు అయ్యాక మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటున్నారు.  గతంలో ఓట్లు వేసిన వారితో పాటు గతేడాది కొత్తగా దరఖాస్తు చేసుకొని ఓటరు కార్డులు వచ్చిన వారిలోనూ ఇలాంటి సమస్య తలెత్తింది. దీనిపై అధికారులు పట్టించుకోవడంలేదు.  

ఏ పోలింగ్​ బూత్​లో ఉందో తెలియక.. 

ఎంపీ, అసెంబ్లీ..  ఏ ఎన్నికైనా ఓటర్లకు సరిగా స్లిప్పులు చేరడంలేదు. దీంతో ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలుసుకోలేక కొందరు పోలింగ్ రోజు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.  దీంతో  కొందరు ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లి పోతుంటారు. ప్రతి ఎన్నికల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా ఓటర్ స్లిప్పుల వందశాతం పంపిణీపై అధికారులు పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. ఆన్ లైన్​లో చూస్తే కనిపించడం లేదు. ఓటర్ స్లిప్ లు రావడం లేదు. చివరకు తమ ఓటు ఉందా లేదా? అనేది కూడా తెలుసుకోలేకపోతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 వీటిలో ఏదైనా ఒకటి ఉంటే చాలు.. 

ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.  ఓటరు కార్డు లేని వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించవచ్చు. వాటిలో 1. ఆధార్ 2.  పాస్‌పోర్ట్‌ 3.  డ్రైవింగ్ లైసెన్స్‌ 4. ఫొటోతో ఉన్న స‌ర్వీస్ ఐడెంటిటీ ​కార్డ్‌ 5. బ్యాంకు పాస్‌బుక్‌ 6. పాన్ కార్డు 7. ఆర్‌జీఐ ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. పింఛ‌న్‌ డాక్యుమెంట్, 11. ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల‌ అధికార గుర్తింపు కార్డు, 12.  రేషన్ 13.  క్యాస్ట్ సర్టిఫికెట్ 14.  ఫ్రీడమ్ ఫైటర్ కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. దివ్యాంగ సర్టిఫికెట్, 17.  లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిటీ కార్డు, 18. పట్టదారు పాస్ బుక్‌లలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది.